జగన్ లో ఈ మార్పుకు కారణమేంటి...?

Update: 2017-03-08 13:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్త అసెంబ్లీ సజావుగానే జరుగుతోంది. ప్రతిపక్ష నేత జగన్ వైఖరిలోనూ మార్పు కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. గత మూడేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సజావుగా జరగలేదు. ప్రతి విషయంలోనూ రగడగా మారి వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే కొత్త అసెంబ్లీలో చాలా మార్పు కన్పిస్తోంది. అధికార పక్షం, విపక్షం రెండూ సభ ప్రశాంతంగా జరిగేలా వ్యవహరిస్తున్నాయన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్ తన వ్యూహాన్ని మార్చినట్లు కన్పిస్తోంది. ప్రతిసారీ ఏదో అంశంపై ప్రశ్నిస్తే...అవకాశమివ్వకపోవడం....సభను వాయిదా వేసుకుని వెళ్లిపోతుండటంతో జగన్ తన రూట్ మార్చారు. ఈసారి ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టేలా జగన్ ప్రసంగం కొనసాగడం గమనార్హం.

స్పీచ్ అదిరిందన్న నేతలు....

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొత్త రాజధానిలో ప్రారంభమయ్యాయి. ప్రతిసారీ వాయిదాల పర్వం కొనసాగుతుండటం మామూలే. కాని ఈసారి సభ రెండు రోజులూ ప్రశాంతంగా జరిగింది. ప్రతిపక్ష నేత జగన్ ప్రసంగం కూడా అందరినీ ఆకట్టుకుంది. తొలుత గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ నేతలు అడ్డుకుంటారని వార్తలొచ్చాయి. ప్రత్యేక హోదాపై రగడ చేస్తారని కూడా అందరూ అనుకున్నారు. కాని గవర్నర్ ప్రసంగాన్ని విపక్షం శ్రద్ధగా వినింది. తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ కూడా ఫలవంతంగా జరిగిందని చెబుతున్నారు. అలాగే ప్రశ్నోత్తరాలకు కూడా ఎవరూ అడ్డుతగలకపోవడంతో సభ రెండో రోజూ ప్రశ్నోత్తరాలు నిరాటంకగా జరిగాయి. జీరో అవర్ కూడా చాలా కాలం తర్వాత జరగింది. జగన్ తన ప్రసంగంలో గవర్నర్ ప్రసంగ పాఠంపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. వరుసగా మూడేళ్లు కరువు ఏపీలో విలయతాండవం చేస్తున్నా అభివృద్ధి రేటు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. నివేదికలో ఉన్న విషయాలనే జగన్ ప్రస్తావిస్తూ ఉండటంతో అధికార పార్టీ కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ ప్రసంగాన్ని కొందరు టీడీపీ నేతలు సయితం మెచ్చుకున్నారు. ఎప్పుడూ సీరియస్ గా ఉండే జగన్ ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో జోకులు కూడా వేశారు. దీనికి చంద్రబాబు కూడా నవ్వటం కన్పించింది. జగన్ ఇలానే వ్యవహరిస్తే బాగుటుందని వైసీపీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు.

అధికారపక్షంలోనూ స్పష్టమైన మార్పు...

మరోవైపు అధికార పార్టీ కూడా జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. ఇది తమకు లాభమేనని అధికారపార్టీ భావిస్తోంది. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను చెప్పుకోవడానికి ఇది వేదికగా భావిస్తోంది. అందుకే ఎవరూ రెచ్చిపోవద్దని, రెచ్చగొట్టద్దని స్పష్టమైన ఆదేశాలు అధినేత నుంచి అందాయని చెబుతున్నారు. విపక్షం అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. ఈ నెల 13 వ తేదీన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. దీనిపైన కూడా ప్రసంగం పూర్తిగా విన్న తర్వాతనే స్పందించాలని జగన్ తన ఎమ్మెల్యేలతో అన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఏపీ శాసనసభలో అధికారపక్షం, విపక్షంలో వచ్చిన మార్పును ఏపీ ప్రజలు స్వాగతిస్తున్నారు.

Similar News