జగన్ ఇలాగే ఉంటే... అంతే సంగతులా?

Update: 2017-11-27 07:30 GMT

వైసీపీ అధినేత జగన్ ను సీనియర్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారా? లేక జగన్ పోకడే అలా ఉందా? ఎందుకు వైసీపీ ఎమ్మెల్యేలు అలా పార్టీని వీడి వెళుతున్నారు. సహజంగా జగన్ పాదయాత్ర చేపట్టగానే పార్టీకి హైప్ వస్తుందని అందరూ భావిస్తారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు దిశగా పార్టీ పయనించే అవకాశముందని క్యాడర్ నుంచి నేతల వరకూ అందరూ అనుకుంటారు. అలాంటిది పాదయాత్ర ప్రారంభించిన 19 రోజుల్లోనే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడటం ఆ పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. ఎమ్మెల్యేలను జగన్ పెద్దగా పట్టించుకోరన్నది పార్టీ ఇన్నర్ వర్గాల టాక్. ఎమ్మెల్యేలను తరచూ కలుస్తూ వారి సమస్యలను వింటే వారికీ కొంత ఊరట లభిస్తుంది. అయితే జగన్ మాత్రం ఆ పని చేయరు. పైగా ఉన్న ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనే కొత్త వారిని ఇన్ ఛార్జులుగా నియమించడం, మరికొందరిని పార్టీలోకి తీసుకువస్తుండటం తోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. ఇందులో జగన్ తప్పిిదంతో పాటుగా పార్టీలో కీలకంగా ఉంటున్న విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ వంటి నేతలు కూడా తప్పదోవ పట్టిస్తున్నారు.

ఎమ్మెల్యేల మనోభావాలను గుర్తించరా?

ఎమ్మెల్యేల మనోభావాలను గుర్తించలేక జగన్ ఇప్పటికే 22 మంది ఎమ్మెల్యేలను పోగొట్టుకుంటున్నారు. టీడీపీ పెద్దయెత్తున ప్యాకేజీ ఇస్తుండటంతో వెళుతున్నారని జగన్ పదేపదే టీడీపీపై ఆరోపణలు చేస్తున్నా.... ఇందులో జగన్ తప్పిదం కూడా ఉందనేది వాస్తవం. ఉదాహరణకు వంతల రాజేశ్వరిని తీసుకుంటే... ఆమె కు రాజకీయ బిక్ష పెట్టింది వైసీపీనే. అయితే రంపచోడవరంలో వంతల రాజేశ్వరి ఎమ్మెల్యేగా ఉన్నా ఆమెకు పోటీగా ఇన్ ఛార్జిని నియమించారు. అనంత ఉదయభాస్కర్ చెప్పినట్లే రంపచోడవరం వైసీపీలో కార్యక్రమాలు జరిగేవి. ప్రాణం వున్నంత వరకూ వైసీపీని విడిచిపెట్టేది లేదన్న వంతల రాజేశ్వరి తన సీటుకే ఎసరు వస్తుందని గ్రహించి టీడీపీలో చేరిపోయారు. ఇక గిడ్డి ఈశ్వరి కూడా అంతే. పాడేరు నియోజకవర్గంలో పట్టున్న నేత ఈశ్వరి వైసీపీకి బలమైన గొంతుక. అయితే కొన్నాళ్లుగా అరకు, పాడేరు నియోజకవర్గంలో జరగుతున్న పరిణామాలను గిడ్డి ఈశ్వరి జీర్ణించుకోలేక పోయారు. మాజీ మంత్రి బాలరాజును పార్టీలోకి తీసుకురావడం, అరుకులో కుంభారవిబాబును తిరిగి పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధమవుతుండటంతో గిడ్డి ఈశ్వరి తీవ్ర మనస్తానానికి గురయ్యారు. వీరి రాకకు విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలే ప్రధాన కారణమని చెప్పక తప్పదు. అధికారంలోకి రాలేకపోయామని తొలినాళ్లలో పార్టీలు మారితే అది అధికారం కోసమేనని ఎమ్మెల్యేలపై బురద జల్లే అవకాశముంది. ఇంకా పట్టుమని ఎన్నికలు ఏడాది కూడా లేవు. అయినా పార్టీని ఎమ్మెల్యేలు వీడుతున్నారంటే జగన్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తన వైఖరిని మార్చుకోవాల్సి ఉంది. కమిట్ మెంట్ ఉన్న నేతలను కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్ దే. మూడున్నరేళ్లు పార్టీనే నమ్ముకుని ఉన్న ఎమ్మెల్యేలు వీడి వెళుతున్నారంటే పార్టీలోనూ, తనలోనూ ఉన్న లోపాలను జగన్ గుర్తించకపోతే మరింత నష్టం జరిగే అవకాశముంది.

Similar News