జగన్ ఇలా...చేస్తే....ఎలా...?

Update: 2017-11-09 14:30 GMT

వైసీపీ అధినేత జనగ్ తప్పు మీద తప్పు చేస్తున్నారా? ప్రజాభిప్రాయం మేరకు నడచుకోవడం లేదా? బీజేపీకి తనను దగ్గరగా చూపుతున్నారంటూ జగన్ నిన్న ఆవేశంగా మాట్లాడారు. అది నిజమే కావచ్చు. నంద్యాల ఎన్నికల పోలింగ్ కు ఒకరోజు ముందు జగన్ పార్టీ బీజేపీకి దగ్గరవుతుందన్న వార్తలు వచ్చాయి. నంద్యాలలో ముస్లిం ఓటర్లను టీడీపీ వైపునకు మలిచేందుకే ఆ వార్తలు సృష్టించారన్నది జగన్ ఆరోపణ. ఇదీ నిజమే కావచ్చు. కాదనలేం. ఎందుకంటే నంద్యాల ఉప ఎన్నికకు ముందే ఈ వార్తలు రావడంతో అప్పుడే అందరికీ అనుమానాలు కలిగాయి. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నది తెలుగుదేశమే. దానిని ఎందుకు హైలెట్ చేయలేదన్నది జగన్ ప్రశ్న. అదీ నిజమే. కాని జగన్ చేస్తున్నదేంది? బీజేపీకి తాను దగ్గరగా లేనని, దేశంలో అత్యున్నత పదవులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మాత్రమే తాను మద్దతిచ్చానని జగన్ చెప్పుకొస్తున్నారు. అందులో కూడా కొంత నిజం లేకపోలేదు. కాని బీజేపీ పై పాదయాత్రలో పల్లెత్తు మాట అనకపోవడం, కేవలం చంద్రబాబునే టార్గెట్ గా చేసుకుని చేస్తున్న ప్రసంగాలు కొందరికి అనుమానాలు కలిగిస్తున్నాయి. పాదయాత్రలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల ప్రస్తావనే లేదు.

నోట్ల రద్దుపై నిరసనలు ఏవీ?

అదంతా సరే. దేశవ్యాప్తంగా పెద్దనోట్ల రద్దయి సామాన్యులు అష్టకష్టాలు పడ్డారు. క్యూలైన్లలో నిల్చుని అక్కడికక్కడే మృతి చెందిన వారూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా క్యూలైన్ లో నిలబడి చనిపోయిన సంఘటనలు చూశాం. కాని పెద్దనోట్ల రద్దు ఒక ప్రహసమన్నది ప్రజాభిప్రాయం. దానివల్ల సామాన్యులకు ఇబ్బంది తప్ప నల్లకుబేరులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదన్నది అందరికీ తెలిసిందే. ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. కూరలు దగ్గర నుంచి ఉప్పు.. పప్పు.. ఏదీ సామాన్యుడే కాదు.. మధ్యతరగతి జీవి కూడా భరించలేని స్థితి. పెట్రోలు ధర రోజురోజుకూ పెరుగుతోంది. కాని వీటన్నింటిపై ఎక్కడా ప్రస్తావనే లేదు. అంతేకాదు నవంబర్ 8వ తేదీన దేశమంతా విపక్షాలన్నీ నిరసనలు తెలుపుతూ బ్లాక్ డే గా పరిగణిస్తే వైసీపీ మాత్రం ఈ కార్యక్రమం జోలికి పోలేదు. బీజేపీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమం కావడంతో ఆ పార్టీ వెనక్కు తగ్గిందన్న కొందరి వాదనల్లో నిజం లేకపోలేదు. బీజేపీకి తాను దగ్గరగా లేనని చెబుతున్న జగన్ నోట్ల రద్దు నిరసన కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు ఎందుకు పిలుపు ఇవ్వలేదన్నది ప్రశ్న. కేంద్రంతో కయ్యం పెట్టుకోవడం జగన్ ఇష్టం లేదన్నది దీంతో మరోసారి రుజువైందంటున్నారు. పాదయాత్రలో కేవలం రాష్ట్ర సమస్యలే కాకుండా.. కేంద్రం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను కూడా యువనేత చర్చిస్తే కొంత రుచికరంగా ఉంటుంది. బీజేపీతో జగన్ అంటకాగుతున్నారన్న ప్రత్యర్థులు, ప్రత్యర్థి మీడియా చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మాల్సి వస్తుంది.

Similar News