జంప్ జిలానీలు సేఫేనా? : స్పీకరు తేల్చకపోవచ్చు!

Update: 2016-11-08 04:25 GMT

విపక్షం నుంచి ఫిరాయించి అధికార పార్టీ పంచన చేరిన జంప్ జిలానీ ఎమ్మెల్యేలు రెండు తెలుగు రాష్ట్రాల్లోను పుష్కలంగా ఉన్నారు. రెండు రాష్ట్రాల్లోను అసెంబ్లీ స్పీకర్లు వారి పట్ల ఒకే రకమైన అంటీ అంటని ధోరణిని అవలంబిస్తున్నారు. ఒకవైపు వారి మీద ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాల్సిందే అని వారి మాతృపార్టీలు ఫిర్యాదు చేసి రభస చేస్తున్నా స్పీకర్లు పట్టించుకోవడం లేదు. తెలంగాణలో ఫిరాయింపుల మీద ఫిర్యాదు వ్యవహారం.. ఒక దశ ముందుకు వెళ్లి సుప్రీం కోర్టులో విచారణ జరగబోతోంది. సుప్రీం ఇప్పటికే.. అనర్హత గురించి నిర్ణయం తీసుకోవడానికి మీకెంత సమయం కావాలో స్పష్టంగా చెప్పాలంటూ.. స్పీకరును కోరింది. తదుపరి విచారణ మంగళవారం జరగాల్సి ఉంది. స్పీకరుకు ఇచ్చిన గడువు కూడా పూర్తవుతున్నందున, తన సమాధానాన్ని ఆయన సుప్రీం కోర్టుకు ఇవాళ చెప్పాల్సి ఉంటుంది.

అయితే జంప్ జిలానీల్లో కంగారు పుడుతున్నదని, స్పీకరు నిర్ణయం ఎటు ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారని రకరకాలుగా ఊహాగానాలు సాగుతున్నాయి.

అయితే అభిజ్ఞవర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఇప్పటికీ ఈ విషయంలో స్పష్టమైన నిర్ణయం అంటూ ఏదీ రాకుండా.. మధ్యేమార్గంగా ఉండే సమాధానాన్నే స్పీకరు కోర్టుకు నివేదిస్తారని తెలుస్తోంది. స్పీకరు కూడా రాజ్యాంగబద్ధమైన పదవే గనుక.. స్పీకరు విధుల్లో కోర్టు జోక్యం చేసుకోగలదా లేదా అనేది చాలా పెద్ద చర్చ. అలాంటి నేపథ్యంలో.. స్పీకరు ఇప్పటికీ నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోకుండా తనకున్న విచక్షణాధికారాలనే ఉపయోగించుకోవచ్చునని తెలుస్తోంది. వీలునుబట్టి నిర్ణయం తీసుకుంటాం అని.. నిర్ణయానికి టైం ఫ్రేం చెప్పడం సాధ్యం కాదని స్పీకరు సమాధానం ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. అలాంటి సమాధానాన్ని కోర్టు తప్పు పట్టడానికి కూడా అవకాశం లేదు. అదే జరిగితే.. పరిస్థితి ఇప్పుడున్న చందంగానే.. మరి కొన్ని నెలల పాటూ సాగతీయడం అవుతుందే తప్ప.. అనర్హత గురించి ఎటూ తేలే అవకాశం మాత్రం ఉండదు. చట్టంలో, స్పీకరు అధికారాల్లో ఉన్న లొసుగులను తెలంగాణ స్పీకరు యథేచ్ఛగా వాడుకోదలచుకున్నారన్నది స్పష్టం. అలాంటి నేపథ్యంలో సుప్రీం కోర్టు అడిగినంత మాత్రాన కంగారు పడిపోయి అనర్హత విషయంలో తక్షణ నిర్ణయం తీసుకుంటారని అనుకుంటే అది భ్రమ అని పలువురు విశ్లేషిస్తున్నారు.

Similar News