చిన్నమ్మకు షాకిస్తున్న ఎమ్మెల్యేలు

Update: 2017-02-09 10:30 GMT

చిన్నమ్మకు అంతటి వ్యతిరేకత ఎందుకొచ్చింది? ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎందుకు చేజారిపోతున్నారు. మన్నార్ గుడి మాఫియాకు భయపడే ఇలా జరుగుతోందా? ముఖ్యమంత్రి కావాలన్న శశికళ కోరిక తీరుతుందా? కష్టమేనంటున్నారు విశ్లేషకులు. ఇటు న్యాయస్థానాల్లో కేసులు, మరోవైపు సొంత పార్టీ నుంచే నేతలు బయటకు ఒక్కొక్కరూ వెళ్లిపోతుండటం చిన్నమ్మ శిబిరంలో ఆందోళన మొదలయింది. ఒక్కొక్కరూ వెళ్లిపోతుండటం కలవరపరుస్తోంది.

మ్యాజిక్ ఫిగర్ లేదట....

తాజాగా అన్నాడీఎంకే పార్టీ ప్రిసీడియం ఛైర్మన్ మధుసూదన్ పన్నీర్ గూటికి చేరిపోయారు. ఆయన ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి పన్నీర్ ను కలిశారు. పన్నీర్ కే మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శిగా మధుసూదన్ ను చేయాలని అమ్మ నాతో చెప్పారని ఇటీవల పన్నీర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మధుసూదన్ చేరికతో పన్నీర్ బలం పెంచుకుంటూ పోతున్నారు. మరోవైపు తాజాగా ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. చెన్నై నగర కమిషనర్ ను బదిలీపై వెళ్లాల్సిందిగా సూచించారు. మరోవైపు అన్నాడీఎంకేలు ఎక్కడ ఉన్నారో కనిపెట్టి వారిని బయటకు తీసుకురావాల్సిందిగా డీజీపీని పన్నీర్ ఆదేశించారు. దీంతో శశికళ వర్గం డైలమాలో పడింది. అందుకే శశికళ బయటకు వచ్చి పన్నీర్ తనకు అండగా ఉన్న ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. అంటే పన్నీర్ ఎమ్మెల్యేలను కొంటున్నారా? లేదా? అనేది పక్కన బెడితే.... శశికళకు ఎమ్మెల్యేల మద్దతు పూర్తి స్థాయిలో అయితే లేదని స్పష్టమైంది. దీంతో ఏం చేయాలో తెలియక శశికళ టెన్షన్ పడుతున్నారు. గవర్నర్ ను కలిసే సమయంలో కనీసం 117 మంది ఎమ్మెల్యేల మద్దతుంటే తాను బలనిరూపణ అవసరం లేకుండా సీఎం పదవిని చేపట్టొచ్చు. ఈ సంఖ్య తగ్గితే ఖచ్చితంగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో చిన్నమ్మ ఆ సంఖ్య తగ్గకుండా చూడాలని తన వర్గ నేతలను ఆదేశించారట. మరోవైపు పన్నీర్ సెల్వానికి మద్దతు పెరుగుతూనే ఉంది. పార్టీపై శశికళ ఆధిపత్యానికి గండికొడ్తానని పన్నీర్ ఢంకా భజాయించి చెబుతున్నారు. మొత్తం మీద చిన్నమ్మ సీఎం అవుతుందా? లేదా? అన్నది చివరి సీన్ వరకూ తేలేలా లేదు.

Similar News