చిన్న పోలిక : బాబు – కేసీఆర్ ఒక్కొక్కరి తీరు చూస్తే...

Update: 2016-11-16 17:52 GMT

నోట్ల రద్దు అనేది ప్రధాని మోదీ ప్రకటించిన నిర్ణయం. కేంద్రప్రభుత్వానికి ప్రమేయం ఉన్న నిర్ణయం అయినప్పటికీ.. ఆ వ్యవహారం వలన ప్రజలకు ఎదురయ్యే కష్టాలను తీర్చడం అనేది, పల్లెలు, పట్టణాల్లో నోట్ల మార్పిడికి ప్రజలు పడే బాధలను తగ్గించడం అనేది రాష్ట్రప్రభుత్వాలకు చెందిన వ్యవహారంగానే తయారయింది. ఎన్డీయేతర పక్షాలు లేదా వైరి పక్షాలు కావడం వలన.. మోదీ నిర్ణయాన్ని తూలనాడిన ప్రభుత్వాలు కూడా.. ప్రజలకు కష్టాలు దూరం చేసే విషయాన్ని తామే బాధ్యతగా స్వీకరించాయి.

అయితే ఇలాంటి కీలక నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా వ్యవహరిస్తున్నారు.. ఎలా స్పందిస్తున్నారు.. ఈ సంక్లిష్ట సమయంలో వారి ప్రధాన ఫోకస్ ఎలా ఉంది అనే అంశాల్ని కంపేర్ చేసి చూస్తే.. చాలా చిత్రంగా కనిపిస్తుంది.

తెలంగాణ కేసీఆర్ విషయానికి వస్తే.. నోట్ల రద్దు పర్యవసానంగా ప్రజలకు కొత్త కష్టాలు, అనూహ్యంగా వారి వినిమయ శక్తి పడిపోవడం నేపథ్యంలో ప్రభుత్వానికి రాబడి తగ్గిపోయిందనే అంశాన్ని రెండోరోజునే గుర్తించి గవర్నరుకు వెళ్లి కంప్లయింటు చేసిన వ్యక్తి టీ-సీఎం కేసీఆర్. ఆనాటినుంచి ఇవాళ్టి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎలా పడిపోతున్నది, ఎంత పడిపోతున్నది, దీనికి కేంద్రంనుంచి ఏదైనా ప్రత్యేకమైన రాయితీ అడగవచ్చునా వంటి చర్యల మీదనే ఆయన ఉన్నతాధికారుల సమావేశాలు అనేకం నిర్వహించారు. ఈ నోట్ల రద్దు అంశాన్ని వాడుకుని ప్రభుత్వానికి ఆదాయం ఎలా పెంచుకోవచ్చునో కూడా చర్చిస్తూ ఆయన అధికార్లతో భేటీలు పెట్టారు. ప్రజల కష్టా ల గురించి ఈటెల లాంటి వాళ్లు అధికార్లతో మీటింగులు పెట్టుకున్నారు.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. నోట్లరద్దు అమల్లోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. కేవలం సమర్థించడమే కాదు, నోట్ల రద్దు వలన ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఏం చేస్తే కాస్త కష్టాలు తగ్గుతాయో అలాంటి నిర్ణయాల కోసం ఆయన అనేక సమావేశాలు నిర్వహించారు. బుధవారం రాత్రి కూడా రాష్ట్రంలోని అందరు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ప్రజలకు ఇబ్బందులు దూరం చేయడం గురించి మాట్లాడారు.

స్థూలంగా చెప్పాలంటే.. నాటినుంచి ఇవాళ్టి వరకు తెలంగాణ సీఎం పెడుతున్న సమావేశాలన్నీ ప్రభుత్వపుకోణంలో.. ప్రభుత్వపు కష్టనష్టాలను దూరం చేయడానికి అనే కోణంలో జరుగుతున్న సమావేశాలు అయితే.. చంద్రబాబునాయుడు పెడుతున్న సమావేశాలు అన్నీ జనానికి ఎదురవుతున్న కష్టనష్టాలను దూరం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయి. ఈ చిన్న పోలికలో అంత లోతైన అంతరార్థం ఉంది మరి !

Similar News