చరిత్ర చెప్పిన పాఠాలను జగన్ నేర్చుకోరా...?

Update: 2017-11-06 11:30 GMT

ప్రజాస్వామ్య దేవాలయం అంటే చట్టసభలే కదా. ప్రజల నుంచి పన్నుల రూపేణా వసూలు చేసిన సొమ్ములను ఎన్నికల నిర్వహణకు వెచ్చిస్తారు. ఆ ఎన్నికల్లో ప్రజల నుంచి గెలిచిన వారు ఆయా చట్టసభల్లో ప్రజావాణిని వినిపిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణమైన చట్టాలు చేయడం ప్రజా రంజక పాలనకు బాటలు నిర్మించడం అధికారపక్షం బాధ్యత. ప్రభుత్వం చేసే చట్టాల్లోని లోపాలను ఎత్తిచూపడం, పాలనలో జరుగుతున్న తప్పిదాలను గుర్తించి చట్టసభల సాక్షిగా ఆ వేదికపై ఎలుగెత్తి ఆ లోపాలను సరిదిద్దే వరకు పోరాటం చేయడం విపక్షం బాధ్యత. ఈ తతంగం అంతా సజావుగా నడిచేలా భారత రాజ్యాంగం దిశా నిర్ధేశం చేస్తుంది. ధర్మరాజులా స్పీకర్ స్థానంలో వుండే వారు ప్రజా ప్రతినిధులకు పార్టీలకు అతీతంతంగా వారు గెలిచిన స్థానాల సంఖ్య ఆధారంగా మాట్లాడే సమయాన్ని కేటాయిస్తారు. చట్టసభలకు సభ్యుల ఎన్నిక, వాటి నిర్వహణ, ఎమ్యెల్యేలు, ఎంపి లుగా గెలిచిన వారికి లక్షలరూపాయల జీత భత్యాలు ప్రయాణపు అలవెన్సులు, రైల్వే , విమాన , బస్, టెలిఫోన్ సౌకర్యాలు రాజధాని ప్రాంతంలో నివాస వసతి వంటివి అన్ని ఉచితంగానే వేలకోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో కల్పిస్తారు. ఇవన్నీ ఇచ్చేది నియోజకవర్గాలవారీగా ప్రజల గొంతు వినిపించాడానికే అన్న బాధ్యతను దురదృష్టం కొద్ది అంతా విస్మరిస్తున్నారు.

వైసిపి తప్పుడు నిర్ణయం తీసుకుందా ...?

ఏపీ శాసన సభ సమావేశాలను నిరవధికంగా బహిష్కరిస్తూ వైఎస్సాఆర్ పార్టీ నిర్ణయించుకోవడాన్ని ప్రజాస్వామ్య వాదులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాష్ట్రానికి సంబంధించి అనేక కీలక సమస్యలు ఉండగా వైసిపి తనపై ప్రజలు ఉంచిన భాధ్యతనుంచి వైదొలగి పోవడంగానే వారు ఈ అంశాన్ని పరిగణిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ , ఉపాధి హామీ పధకంలో అవకతవకలు, వేలకోట్ల రూపాయల సొమ్ము ను ఉచిత ఇసుక మాటున మింగుతున్న రాజకీయ దళారులు , కేవలం నంద్యాల ఉపఎన్నికల్లోనే డ్వాక్రా మహిళలకు బ్యాంక్ ఎకౌంట్స్ లో ప్రభుత్వం డబ్బులు జమ చేసి మిగిలిన రాష్ట్రంలో వున్న డ్వాక్రా వారికి చెల్లించకపోవడం, అప్పుల ఊబిలో వున్న ఆర్థికపరిస్థితి, రియల్ ఎస్టేట్ వెంచర్ లా మారుతున్న అమరావతి, సదావర్తి భూముల వ్యవహారం, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం, రైతులకు గిట్టుబాటు ధర, నీటి జగడాలు, సాగునీటి ప్రోజెక్టుల అవినీతి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కీలక అంశాలపై ప్రజలపక్షాన వైసిపి ప్రభుత్వంపై అసెంబ్లీ సాక్షిగా పోరాడాలిసివుంది. కానీ, వైసిపి పార్టీ ఫిరాయింపు ఎమ్యెల్యేలపై చర్యలు లేనందున అనే సాకును చూపి అసెంబ్లీ సెషన్స్ వదిలివేయడం చారిత్రక తప్పిదమే అవుతుందని మెజారిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇది ఆత్మహత్యసదృశ నిర్ణయంగా అభివర్ణిస్తున్నాయి. జగన్ పాదయాత్రలో ఉంటూనే తమ పార్టీ శాసన సభ్యులకు దిశా నిర్దేశం చేస్తూ సాగిపోవాలి తప్ప అసెంబ్లీనుంచి మొత్తం పార్టీనే లేకుండా చేసుకోవడం అధికార పార్టీకే మేలు చేసే చర్యగా భావిస్తున్నారు ప్రజాస్వామ్యవాదులు.

ఇలా దేశంలోనే జరగలేదు ...

దేశ చరిత్రలోనే సుదీర్ఘ కాలం పార్టీ పార్టీనే చట్టసభను మొత్తం బహిష్కరించడం జరగలేదని విశ్లేషకులు అంటున్నారు. ఏపీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ సైతం గతంలో ఎన్టీఆర్, జయలలిత, మాయావతి వంటి వారు వారి ప్రత్యర్థుల పై సవాల్ విసురుతూ వారి వరకే బహిష్కరించారు తప్ప మొత్తం పార్టీ తో సహా బాయ్ కాట్ చేసే పని ఎన్నడూ చేయలేదంటున్నారు. ఇప్పటికైనా విపక్షం తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని స్పీకర్ సూచించడం విశేషం.

ఫిరాయింపులకు భయపడేనా...?

వైసిపి కి చెందిన 22 మంది ఎమ్యెల్యేలు ఇప్పటివరకు అధికార టిడిపిలోకి జంప్ అయిపోయారు. వీరంతా రాజీనామాలు చేసి ప్రజా తీర్పు కోరకుండా అభివృద్ధి పేరుతో వెళ్లిపోయారు. అధినేత జగన్ పాదయాత్ర పూర్తి అయ్యేలోపు మరో 15 మందిని కనీసం పార్టీ మార్పించాలన్న లక్ష్యంతో టిడిపి ఎత్తుగడలు మొదలు పెట్టింది. అసెంబ్లీ సమావేశాల్లో తాను లేకుండా వైసిపి ఎమ్యెల్యేలు వెళ్లడం వల్ల అక్కడ అధికారపార్టీ వారిని లోబర్చుకుంటుందేమో అన్న భయం కూడా జగన్ ను వెంటాడటం వల్లే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చన్న ప్రచారం సాగుతుంది. గతంలో వైఎస్ఆర్ సీఎం గా వున్నప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించి టిఆర్ ఎస్ ను దాదాపు తుడిచిపెట్టినంత పని చేశారు. టిడిపి కి చెమటలు పట్టించారు. కానీ గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ ఎగిరొడ్డి పోరాడి తెలంగాణకే సీఎం అయ్యారు. 10 ఏళ్ళు అధికారానికి దూరం అయినా టిడిపి కూడా ఎక్కడా వెనుకంజ వేయలేదు. పోయిన చోటే వెతుక్కుని అధికారాన్ని సాధించింది. మరి చరిత్ర చెబుతున్న పాఠాలు నుంచి జగన్ ఎందుకు నేర్చుకుని పార్టీని నడిపించలేకపోతున్నారన్న చర్చ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

Similar News