చంద్రబాబుపై మండిపడుతున్న మోహన్ బాబు

Update: 2016-11-06 01:06 GMT

తన మనసుకు తోచింది ముక్కుసూటిగా మాట్లాడే అలవాటు ఉన్న సినీ ఇండస్ట్రీ ప్రముఖుడిగా పేరున్న మంచు మోహన్ బాబు ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీద కినుక వహించి ఉన్నారా? చంద్రబాబునాయుడు వ్యవహరించిన తీరుపట్ల ఆగ్రహంతో ఉన్నారా ? అభిజ్ఞ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి అవుననే సమాధానమే వస్తోంది. అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమచారాన్ని బట్టి.. దీనికి సంబంధించి కారణాలు ఈ విధంగా ఉన్నాయి.

మంచు మోహన్ బాబు చిత్తూరుజిల్లా చంద్రగిరి సమీపంలో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వాటికి సమీపంలోనే ఆయన ఒక షిరిడి సాయిబాబా ఆలయాన్ని, కల్యాణ మండపం, అన్నిటినీ మించి భారీ స్థాయిలో ఒక వృద్ధాశ్రమం, దానికి తగిన విధంగా ఆస్పత్రి ఇలాంటివి నిర్మించాలని అనుకున్నారు. మోహన్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన అదే ఫౌండేషన్ పేరు మీద ఇవన్నీ కూడా చేయాలని అనుకున్నారు. అయితే వీటికి సంబంధించి.. ఆ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాన్ని నామమాత్రపు ధరకు విక్రయించాల్సిందిగా సర్కారు వారికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఒక ఆలయం, కల్యాణ మండపం, వృద్ధాశ్రమం ఇవన్నీ కలిపి నిర్మించాలంటే స్థలం కూడా బాగానే అవసరం అవుతుంది. అయితే కొంత ప్రభుత్వం కేటాయిస్తే.. కొంత తన సొంత సొమ్ముతో కొనుక్కోవచ్చునన్న ఉద్దేశంతో మోహన్ బాబు ఐదు ఎకరా ల ప్రభుత్వ స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే సుమారు నెల కిందట జరిగిన చంద్రబాబునాయుడు కేబినెట్ భేటీలో మోహన్ బాబుకు స్థలం కేటాయించేశారు. అయితే కేవలం 1.5 ఎకరాలు మాత్రమే కేటాయించారు. ఇన్ని బృహత్ ప్రాజెక్టులు పెట్టుకున్నప్పుడు 1.5 ఎకరాలు అనేది చాలా తక్కువ స్థలం అవుతుంది. ఈ మాత్రం జాగాలో గుడి, కల్యాణ మండపం, వృద్ధాశ్రమం అన్నీ చేయడం కలలో మాట. తాను మంచి పని చేయడానికి కనీసమైన స్థలం అడిగితే.. అందులో కూడా కోతపెట్టి కొంత జాగానే ఇచ్చారని మోహన్ బాబుకు మనస్తాపం కలిగిందిట.

ఇదిలా ఉండగా, ఇటీవలి కేబినెట్ భేటీలో చంద్రబాబునాయుడు రాష్ట్రంలో నాలుగు ప్రెవేటు యూనివర్సిటీలకు అనుమతులిచ్చేశారు. మోహన్ బాబు తన శ్రీవిద్యానికేతన్ సంస్థకు యూనివర్సిటీ హోదా కోసం కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే దానికి యూనివర్సిటీ హోదా ఇంకా దక్కలేదు. ఈ రెండు అంశాలు మోహన్ బాబు ను మసస్తాపానికి గురిచేశాయని అనుకుంటున్నారు. అందుకే ఆయన చంద్రబాబు మీద ఆగ్రహంగా ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు.

Similar News