చంద్రబాబుపై ఒత్తిడి పెంచనున్న కేసీఆర్ నిర్ణయం

Update: 2016-10-28 05:04 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక విషయాన్ని రెండున్నరేళ్ల నుంచి సాగదీస్తూ ఉన్నారు. దాని మీద రాష్ట్రంలో ఎంతగా రాద్ధాంతం జరుగుతూ ఉన్నా సరే.. ఆయన సాగదీసుకుంటూనే వెళుతున్నారు. అదే మాదిరి – సేమ్ టూ సేమ్- నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేసరికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంతా నిమిషాల్లో తేల్చి పారేశారు. ఈ వైఖరి చంద్రబాబునాయుడు మీద కూడా తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. ఆ ఒత్తిడిని ఆయన ఎలా తట్టుకుంటారో, కేసీఆర్ తో పోలుస్తూ చంద్రబాబు నాన్చివేత ధోరణిని ప్రతిపక్షాలు ఎండగడితే ఆయన ఎలా తట్టుకుంటారో వేచిచూడాలి.

ఆంధ్రప్రదేశ్ లో కాపులను బీసీల్లో చేర్చడం అనే అంశం కొన్ని సంవత్సరాలుగా నానుతూ ఉంది. వారికి ఆమేరకు హామీ ఇవ్వడం ద్వారా చంద్రబాబునాయుడు ఈ తడవ అధికారంలోకి వచ్చారు. కాపులు ఒకవైపు ఉద్య మాలు , దీక్షలు ధర్నాలు ఆందోళనలు చేస్తూ ఉండగా.. ఆయన మాత్రం బీసీల్లో చేర్చే విషయాన్ని ఒక పట్టాన తేల్చడం లేదు. ఆయన నియమించిన మంజునాధ కమిషన్ తమకంటూ ఒక గడువు, డెడ్ లైన్ లేనట్లుగా పర్యటనలు చేసుకుంటూనే గడుపుతోంది.

ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో ఒక బీసీ కమిషన్ ను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ వెంటనే ముస్లింలను బీసీల్లో కలపడానికి సంబంధించి కీలకమైన ప్రకటన చేశారు. రాష్ట్ర శాసనసభలో అవసరమైతే చట్టం చేసి మరీ.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న బీసీ కులాల వారికీ అన్యాయం జరగకుండానే కొత్తగా ముస్లింలకు కూడా రిజర్వేషన్లు కల్పించే ఏర్పాటును పరిశీలిస్తాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చేశారు.

ఏపీలో కాపులకు బీసీ రిజర్వేషన్లు అనే అంశాన్ని ఎన్నికల వేళ తెలుగుదేశం ట్రంప్ కార్డులాగా వాడుకున్నట్లే, తెలంగాణలో ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు అనే అంశాన్ని కూడా వాడుకుంది. తెరాస సర్కారు ఏర్పడిన తర్వాత.. విపక్ష కాంగ్రెస్ ఇదే విషయం మీద పలుమార్లు తెరాసను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించింది కూడా.. అయితే తాజాగా కేసీఆర్ తన ప్రకటనతో ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టినంత పని చేశారు. నిజానికి చంద్రబాబునాయుడు నుంచి కూడా ఇలాంటి విస్పష్టమైన హామీనే అక్కడ రాష్ట్రంలో కాపులు కోరుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం శషబిషలు మానడం లేదు. అందుకే కేసీఆర్ తాజా దూకుడు, చంద్రబాబు మీద ఒత్తిడి పెంచే అవకాశం ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు.

Similar News