చంద్రబాబు సైడ్‌లైన్ : రేవంత్ ఈజ్ సుప్రీమ్!

Update: 2016-10-31 13:21 GMT

ఒకసారి జాతీయ పార్టీగా అవతరించిన తరువాత.. స్థానిక నాయకత్వాలు నామ్ కేవాస్తే పార్టీని నడపడానికే తప్ప.. విధాన నిర్ణయాలు తీసుకునే అదికారం వారి చేతుల్లో ఉండదు. కేంద్ర నాయకత్వమే విధాన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. చిన్న చిన్న మార్పు చేర్పులతో దాన్ని పాటిస్తూ పోవడమే స్థానిక నాయకత్వం పని. కానీ, ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీరును గమనిస్తే తనే సర్వస్వంగా పార్టీ విధానాలను డిసైడ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ సర్కారు పాలనకు వ్యతిరేకంగా సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం మహా పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకున్న ఈ పాదయాత్రలో సోమవారం నాడు రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

కేవలం పాల్గొనడం మాత్రమే కాదు. ఆ మాటకొస్తే.. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా దానికి మద్దతుగా శిబిరంలో కూర్చున్న చరిత్ర రేవంత్ రెడ్డికి ఉంది. తమ్మినేని మహా పాదయాత్రలో కూడా తాను పాల్గొనడానికి ఆయన డిసైడ్ చేసుకోవడాన్ని బట్టి.. రేవంత్ రెడ్డి తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అతీతంగా తనకంటూ సొంత అస్తిత్వం సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తున్నారేమో అని అంతా అనుకున్నారు.

కానీ పాదయాత్రలో పాల్గొన్న రేవంత్ మరో ట్విస్టు కూడా ఇచ్చారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీపీఎం నిర్వహించే అన్ని ప్రజాపోరాటాలకు మద్దతుగా నిలుస్తుందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవ్వరు పోరాడినా తాము మద్దతిస్తాం అంటూ తేల్చేశారు. ఇది చాలా చిత్రమైన సంగతి.

సీపీఎం అనేది ఎంత చెడ్డా తెలుగుదేశం పార్టీ ఉన్న ఎన్డీయే కూటమికి శత్రుపక్షం. కేసీఆర్ సర్కారు ఎంత దుర్మార్గమైనదైనా కావొచ్చుగాక, సీపీఎం ఎంతటి ఆందోళననైనా నిర్వహించవచ్చు గాక.. దానికి భాజపా మద్దతివ్వదు కదా. మరి తెదేపా మద్దతివ్వడం కూడా చిత్రమే.

ఆ మాటకొస్తే.. ఇటీవలి పరిణామాలు కొన్ని చంద్రబాబు మాటను ఖాతరు చేయకుండా రేవంత్ వ్యవహరిస్తున్నాడనే చర్చను తెలంగాణ తెలుగుదేశం పార్టీలో రేకెత్తిస్తున్నాయి. ఉభయ రాష్ట్రాల నాయకులతో చంద్రబాబునాయుడు ఇటీవల పాలిట్ బ్యూరో సమావేశం నిర్వహించినప్పుడు... సచివాలయ భవనాల్ని తెలంగాణ సర్కారుకు అప్పగించేయడం గురించి నిర్ణయం తీసుకుంటాం అని చెబుతోంటే.. డిబ్లాక్ కూల్చివేతను అడ్డుకుంటూ ఉద్యమించబోతున్నాం అని రేవంత్ అడ్డుపుల్ల వేసినట్లు వార్తలు వచ్చాయి. స్థానిక పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకోమని చంద్రబాబు అప్పటికి విషయం దాటేసినట్లు సమాచారం. అయితే ఆ స్వేచ్ఛను రేవంత్ రెడ్డి మితిమీరి వాడుకుంటున్నాడా... తెలంగాణ తెలుగుదేశం పార్టీకి తానే విధానకర్త అనుకుంటున్నాడా? ఇలాంటి రెబెల్ పోకడలను చంద్రబాబునాయుడు ఏమేరకు సహిస్తారు అనేది వేచిచూడాలి.

Similar News