చంద్రబాబు మెడపై కత్తి : ప్యాకేజీకి చట్టబద్ధత

Update: 2016-10-30 02:59 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అక్కర్లేదు, అంతకు మించిన ప్యాకేజీ ఇస్తున్నారు... ప్యాకేజీని వ్యతిరేకిస్తున్న వాళ్లంతా ప్రగతి నిరోధకులు... హోదా కావాల్సిందేనంటూ మాట్లాడేవాళ్లు అజ్ఞానులు ... ఇలా చంద్రబాబునాయుడు నానా రకాలుగా ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నించారు. ఆ పర్వం అయిపోయింది. ఇప్పుడు అందరూ ప్యాకేజీ తప్ప మనకు దక్కేదేమీ లేదు అని అలవాటు పడ్డారు. అయితే ప్యాకేజీకి చట్టబద్ధత ఉంటుందా? కేంద్ర సర్కారు దయా దాక్షిణ్యాల మీద మనం ప్యాకేజీ పుచ్చుకోవాల్సిందేనా? లేదా, అది మనకు చట్టబద్ధమైన హక్కుగా సంప్రాప్తిస్తుందా అనే విషయం దగ్గర ఇప్పుడు మీమాంస నడుస్తోంది.

ప్యాకేజీ ప్రకటించిన నాటినుంచి, దీనికి చట్టబద్ధత ఉండాల్సిందేనంటూ చంద్రబాబునాయుడు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కానీ కేంద్రానికి సంబంధించి పెద్దలెవ్వరూ ఆయన మొరలను కనీసం చెవిన వేసుకున్నట్లుగా కూడా కనిపించడం లేదు. మొన్నటికి మొన్న కోర్ కేపిటల్ భవనాల శంకుస్థాపన సందర్భంగా కూడా.. అరుణ్ జైట్లీ వచ్చినప్పుడు... ఆయనను చంద్రబాబు ఇదే కోరారు. ప్యాకేజీకి చట్టబద్ధత గురించి విన్నవించుకున్నారు. చంద్రబాబు చేసిన ఏకైక డిమాండ్ చట్టబద్ధత కాగా, దాన్ని గురించి అటు జైట్లీ గానీ, వెంకయ్యనాయుడు గానీ నామమాత్రంగా కూడా స్పందించలేదు.

ఒకవైపు రాష్ట్రంలో విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, మిత్రపక్షమే అయినా జనసేన పార్టీ అందరూ కూడా ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ పట్టుపడుతూ ఉండగా... చంద్రబాబునాయుడు వారందరి అభిప్రాయాలను తోసిరాజని ప్యాకేజీకి ఓటేశారు. అంత ఘనంగా ప్యాకేజీ గురించి భుజాన మోసినందుకు ... దానికి చట్టబద్ధత తీసుకురావడం అనేది ఇప్పుడు చంద్రబాబునాయుడు బాధ్యతే! అయితే కేంద్రం ఆయన డిమాండ్ ను ఏమాత్రం పట్టించుకోకుండా ఉంటున్న నేపథ్యంలో.. చట్టబద్ధత సాధించకపోతే... ఆయన పరువు పోవడం గ్యారంటీ. అందుకే ప్యాకేజీకి చట్టబద్ధత సాధించడం అనేది చంద్రబాబునాయుడు మెడపై కత్తిలా ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు.

Similar News