చంద్రబాబు బాటలోనే కేసీఆర్ మంత్రదండం!

Update: 2016-10-23 01:12 GMT

సొంత పార్టీ ఎమ్మెల్యేలను నిత్యం తన అదుపాజ్ఞల్లో ఉంచుకోవడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరించే సిద్ధాంతం , ప్రయోగించే మంత్రదండం ఏది అంటే ‘సర్వేలు’ అని రాష్ట్రంలో రాజకీయ అవగాహన ఉన్న పసిపిల్లలు కూడా చెప్పేస్తారు. ఎమ్మెల్యేల పనితీరు మీద ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించడం. సర్వే ఫలితాలు అంటూ వారికి మాత్రమే వ్యక్తిగతంగా కొన్ని కాగితాలు ఇవ్వడం. అక్కడినుంచి వారి పనితీరు లోగుట్టు తనకు అర్థమవుతున్నదంటూ.. వారిని తన అదుపులో ఉంచుకోవడం అనేది ఆయన స్ట్రాటెజీ. చూడబోతే ఇప్పుడు గులాబీ బాస్ కేసీఆర్ కూడా ఎమ్మెల్యేల మీద అదే సర్వేల అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రసమితికి చెందిన పలువురు ఎమ్మెల్యేల పనితీరు మీద ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా గుర్రుగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. పార్టీకి పరువు నష్టం కలిగించేలా ఎమ్మెల్యేలు కొందరు వ్యవహరిస్తున్నారని పార్టీ అధినేత భావిస్తున్నారు. అలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వరాదని కూడా అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. సిటింగులకు టికెట్లు ఇవ్వకుండా నియంత్రించినా సరే.. వారు నోరెత్తి మాట్లాడకుండే పరిస్థితిని ముందే సృష్టించడానికి సర్వే అస్త్రాన్ని ప్రయోగించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఏపీలో ఇప్పుడు అదే పరిస్థతి నడుస్తోంది. ప్రజల మీద కాదు కదా.. ఎమ్మెల్యేల మీద సర్వేలు చేయించడం ద్వారా.. వారి పనితీరులో లోపాలన్నిటినీ తాను తెలుసుకుంటున్నాను.. అనే సంకేతాలు ఇచ్చారు చంద్రబాబు. ఇటీవల పార్టీ శిక్షణ కార్యక్రమాల సందర్భంలో వారికి ఇచ్చిన వ్యక్తిగత సర్వే రిపోర్టుల్లో చిన్న చిన్న తప్పులు కూడా ఉన్నట్లు సమాచారం. అదే తరహాలో.. తన పార్టీ ఎమ్మెల్యేల మీద కూడా సర్వే చేయించాలని, కనీసం ఆ పేరిట వారిని అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలని కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లుంది.

Similar News