చంద్రబాబు పీకలపై కేసీఆర్ కత్తి!

Update: 2016-10-22 13:16 GMT

చంద్రబాబునాయుడు మెడమీద ఇప్పుడు కేసీఆర్ వేటకత్తిలా వేలాడుతున్నారు. కేసీఆర్ తో పోల్చి జనం తను సాధించిన విజయాలను బేరీజు వేయడం ప్రారంభిస్తే.. కొంప కొల్లేరు అవుతుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులే వ్యఖ్యానిస్తున్నాయి. ఇటు తెలంగాణలో సచివాలయం కోసం ఉన్న భవనాలను పూర్తిచేసి , ఆకాశహర్మ్యం వంటి కొత్త భవనం నిర్మించాలని కేసీఆర్ సంకల్పిస్తుండడం.. అక్కడ అమరావతిలో కోర్ కేపిటల్ నిర్మాణానికి సంకల్పం రెండూ ఏకకాలంలోనే జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో పనుల విషయంలో ఎవరు వెనుకబడితే వారికి జనం దృష్టిలో పరువునష్టం తప్పకపోవచ్చు.

చంద్రబాబునాయుడు అమరావతిలో కోర్ కేపిటల్ నిర్మాణానికి ఈనెల 28న అరుణ్ జైట్లీ తో శంకుస్థాపన చేయించబోతున్నారు. అదే సమయంలో నవంబరులో తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఇంచుమించుగా ఇద్దరూ ఒకే తరహా బాధ్యతను ఒకే సమయంలో ప్రారంభించబోతున్నారన్నమాట.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏ ప్రభుత్వం పనులు ఏ వేగంతో పూర్తిచేస్తున్నదో గమనిస్తూ ఉంటారనడంలో సందేహం లేదు. ఇక్కడేమో తెలంగాణలో ఏడాదిలోగా కొత్త సచివాలయాన్ని పూర్తిచేసి ప్రారంభించేయాలని కేసీఆర్ శంకుస్థాపనకు ముందే లక్ష్యాలు నిర్దేశిస్తున్నాడు.

అటువైపు అమరావతి లో పరిస్థితులో చంద్రబాబు చేతుల్లో లేవన్నది నిజం. అక్కడ ప్రతి చిన్న పని కూడా.. కేంద్రం విడుదల చేసే నిధుల మీద, నిధులు వచ్చే వేగం మీద ఆధారపడి ఉంటుంది. కోర్ కేపిటల్ నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చినా, దానికి సమాంతరంగా చంద్రబాబు రాష్ట్ర నిధులతో ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ మొత్తం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దానికే ఆయన 35 వేల కోట్ల బడ్జెట్ చెబుతున్నారు.

ఇక్కడ కేసీఆర్ తెలంగాణ సచివాలయాన్ని పూర్తిచేసి ప్రారంభించేలోగా, అమరావతి కోర్ కేపిటల్ నిర్మాణాలకు కనీసం ఒక రూపు తీసుకురాకపోతే.. మాత్రం.. అది చంద్రబాబు ప్రతిష్టకు దెబ్బ అవుతుంది. కేసీఆర్ తో పోల్చి.. దాన్ని ఆయన వైఫల్యం కింద జనం జమకట్టినా ఆశ్చర్యం లేదు.

Similar News