చంద్రబాబు చదరంగక్రీడలో బలయ్యేది ఎవరు?!

Update: 2016-10-24 02:31 GMT

కాపుల పోరాటాన్ని ఎదుర్కోవడంలో చంద్రబాబు ఆ సామాజిక వర్గానికి చెందిన వారినే ముందుకు నెడుతున్నారు. సాధారణంగా పాలకులు ఎవరైనా సరే అనుసరించే ధోరణి ఇదే! అయితే ఇవి సాంతం ఆయన అనుకున్న తీరులోనే నడుస్తున్నాయా? కాపుల్లో ఒక వర్గం చంద్రబాబు కు వ్యతిరేకంగా సాగిస్తున్న ప్రచారానికి దీటుగా, తెలుగుదేశంలోని చంద్రబాబు బంట్లు చంద్రబాబు అనుకూల ప్రచారాన్ని చేయగలుగుతున్నారా? అనేది కీలక చర్చనీయాంశం అవుతోంది.

కులాల సమీకరణాలకు పెద్దపీట వేయాల్సి వస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల్లో చంద్రబాబు తన వ్యూహాలకు మరింతగా పదును పెడుతూనే ఉన్నారు. ప్రధానంగా కాపు ఓటు బ్యాంకును తెలుగుదేశం వశం చేసుకోవడానికి కన్నేసిన చంద్రబాబునాయుడు, రిజర్వేషన్ అంశాన్ని తెరమీదికి తెచ్చారు. కాపు రిజర్వేషన్‌లు ఇస్తే , ఆ కులంలోని ఆయన వందిమాగధులు కొందరు చెబుతున్నట్లే కాపు వర్గం ఆయనను దేవుడి కింద పరిగణించినా ఆశ్చర్యం లేదు. కానీ.. ఆ ఘట్టం సమీపించే వరకు రాష్ట్రంలో కులాల మధ్య రిజర్వేషన్ అనే చిచ్చు రగలడానికి, కాపులు, కాపేతర బీసీలు ఒకరినొకరు అనుమానపు దృక్కులతో చూసుకుంటూ, విద్వేషాలు పెంచుకోవడానికి చంద్రబాబునాయుడు బీజం వేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కులాల రావణకాష్టం చుట్టూతా చంద్రబాబునాయుడు ఆడుతున్న రాజకీయ చదరంగంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మరియు హోం మంత్రి చినరాజప్ప ఓ పావుగా మారిపోతున్నట్లు కనిపిస్తోంది. చదరంగంలో పావు అంటే ఆయనేమీ సర్వాధికారాలు వెలగబెట్టే ‘క్వీన్’ వంటి పావు కాదు! ఏ చిన్న అవసరానికైనా బలిచేయడానికి ముందుగా ఎంచుకునే బంటు లాంటి పావులాగా ఆయన పరిస్థితి కనిపిస్తోంది.

తన ఉద్యమాల ద్వారా కాపుల్లో ఎంతో కొంత పాజిటివ్ ఇమేజిని తెచ్చుకున్న ముద్రగడ పద్మనాభాన్ని అదేపనిగా తిట్టిపోసే బాధ్యత చినరాజప్ప భుజస్కంధాల మీదనే పెట్టినట్లుంది. చంద్రబాబు మంత్రి వర్గంలో కాపునాయకులుగా కుల ముద్ర ఉన్న ఇంకా చాలా మంది ప్రముఖులు ఉన్నారు. కానీ వారంతా వ్యూహాత్మకంగా చిన్న చిన్న కౌంటర్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ప్రతిసారీ ముద్రగడను ఎడాపెడా తిట్టిపోసే బాధ్యత చినరాజప్ప మీదనే పడుతోంది.

ముద్రగడను పదేపదే తిట్టడం వల్ల కాపుల్లో తమకు చెడ్డపేరు తప్పదని కొందరు మంత్రులు ముందుజాగ్రత్త పాటిస్తోంటే.. చినరాజప్ప మాత్రం.. అలాంటి తెలివిడి లేకుండా.. ఎడా పెడా చంద్రబాబు ప్రీత్యర్థం దూషణల పర్వం కొనసాగిస్తున్నట్లుగా ఉంది. ఉద్యమించే కాపునేతలను తిట్టిపోయాలన్నా ఆయనే, లోకేష్ అవగాహన రాహిత్యం గురించి బయటపడకుండా డిఫెండ్ చేయాలన్నా ఆయనే.. జనం దృష్టిలో పలుచన అయిపోయే ప్రతి సందర్భానికీ.. చంద్రబాబు తొలి ఎంపిక చినరాజప్పే అవుతున్నారా? అని భావించాల్సి వస్తోంది. ఆ రీతిగా గమనిస్తే.. అచ్చంగా చంద్రబాబునాయుడు చదరంగంలో చినరాజప్ప పావుగానే ఉన్నారని... ఎంత చిన్న ఎదురుదాడులు వచ్చినా.. ముదుంగా ఆ దెబ్బలు తనకు తప్పవని అనిపిస్తోంది.

Similar News