గ్లోబల్ పాపానికి నిష్కృతి ఏమిటి?

Update: 2016-11-07 05:01 GMT

నిఖిల్ రెడ్డి అనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎత్తు పెరగాలనే కోరికతో వస్తే.. అనుచితమైన వైద్యం చేసి, అనవసరమైన ఆపరేషన్ చేసి.. అతడి జీవితాన్ని బలితీసుకున్న గ్లోబల్ ఆస్పత్రి దుర్మార్గం గురించి అందరికీ తెలుసు. అయితే ఆస్పత్రి యాజమాన్యం ఇప్పటికీ ఎంత పాశవికంగా వ్యవహరిస్తున్నదో... కనీస మానవత్వపు విలువలు లేకుండా.. రోగి విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తున్నదో తాజా దృష్టాంతాలను గమనిస్తే అర్థం అవుతుంది. రోగి ఎలా చచ్చినా సరే తమకే మీ సంబంధం లేదన్నట్లుగా కార్పొరేట్ ఆస్పత్రులు వ్యవహరించే పెడపోకడలకు గ్లోబల్ ఆస్పత్రి సజీవ సాక్ష్యంగా కనిపిస్తోంది. అంతే కాదు.. అయినకాడికి కాసులు దండుకోవడమే తప్ప.. రోగి క్షేమంతో తమకు ఎంతమాత్రమూ నిమిత్తం లేదనే కార్పొరేట్ వైద్యసంస్కృతిని వీరు ప్రతిబింబిస్తున్నారు. ’’సాంకేతికంగా‘‘ బాధ్యత తమది కానప్పుడు ఇక రోగి విషయంలో ఏమాత్రం పట్టించుకునే ఉద్దేశమే ఆస్పత్రి యాజమాన్యాలకు లేదన్నది తేలిపోతున్నది.

గ్లోబల్ ఆస్పత్రి - నిఖిల్ రెడ్డి అనే రోగి విషయంలో వ్యవహరించిన అక్రమమార్గం అందరికీ తెలుసు. నిఖిల్ రెడ్డి తనకు పొడవు పెరగాలని ఉందని వెళితే.. కనీసం అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా అతి ప్రమాదకరమైన ఆపరేషన్ చేసేశారు. తీరా ఆపరేషన్ వికటించి.. పరిస్థితి వివాదాస్పదంగా మారినప్పుడు.. ఆపరేషన్ నిమిత్తం వచ్చిన కుర్రాడు మేజర్ గనుక.. అతని అనుమతి ఉంటే చాలునని, అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత తమకు లేదని గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యం, ఆపరేషన్ చేసిన డాక్టర్ చంద్రభూషణ్ అప్పట్లో వాదించారు. అంటే ’సాంకేతికంగా‘ వారికి బాధ్యత లేదు గనుక.. ఇక ఆ కేసు ఎలా పోయినా తమకు సంబంధం ఏమిటన్నట్టు వాదించారు.

అయితే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. అయితే వారి వైఖరి కూడా అనుమానాస్పదంగానే తయారైంది. ఆపరేషన్ చేసిన చంద్రభూషణ్ మీద వారు రెండేళ్లు నిషేధం విధించారే తప్ప.. ఇలాంటి అరాచక ఆపరేషన్లను ప్రోత్సహిస్తున్న గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యం మీద వీసమెత్తు చర్య తీసుకోలేదు. మరి మెడికల్ కౌన్సిల్ చిత్తశుద్ధి నిజాయితీ కూడా శంకించాల్సినవే.

అలాంటి నేపథ్యంలో గ్లోబల్ యాజమాన్యం దుర్మార్గపు వైఖరి మళ్లీ బయటపడింది. మెడికల్ కౌన్సిల్ డాక్టర్ చంద్రభూషణ్ పై నిషేధం విధించగానే.. ‘‘సాంకేతికంగా’’ తను తగడు గనుక.. ఆయన నిఖిల్ రెడ్డి ఇంటికి వారానికి ఒకసారి వచ్చి అందిస్తున్న వైద్య సహాయాన్ని నిలిపేశాడు. పట్టించుకోలేదు. అటు వైద్యం చేసిన డాక్టరు.. నిషేధం సాకు చూపి తప్పించుకున్నాడు. అయితే.. అదే నిఖిల్ రెడ్డి వద్దకు ప్రత్యమ్నాయంగా చికిత్స నిమిత్తం మరొకరిని పంపడం తమ బాధ్యత అని గ్లోబల్ యాజమాన్యం అనుకోలేదు. ‘‘సాంకేతికంగా’’ ఆ బాధ్యత తమ మీద లేదు గనుక.. వారు మిన్నకుండిపోయారు.

పర్యవసానంగా... మోకాళ్ల వద్ద ఆపరేషన్ చేసిన స్టీల్ రాడ్ లు పెడితే.. ఏడు నెలలుగా ఇవాళ్టికి కూడా నడవలేని స్థితిలో మంచానికి పరిమితమై ఉన్న నిఖిల్ రెడ్డి.. పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ఈ విషయంలో మీడియా మొత్తం జరుగుతున్న ఘోరం గురించి కోడై కూసిన తరవాత, ఆస్పత్రి యాజమాన్యం కళ్లు తెరచుకున్నట్లుంది. వేరే వైద్యులను పంపి నిఖిల్ రెడ్డికి వైద్యం చేయిస్తున్నారు.

అయితే ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కళ్లు తెరచి చూడవలసిన సత్యాలు ఇంకా అనేకం ఉన్నాయి. ఒక నేరం జరిగినప్పుడు దాని మూలాల్లోకి వెళ్లకుండా డాక్టర్ చంద్రభూషణ్ మీద మాత్రం నిషేధం విధించడం, ఆస్పత్రి యాజమాన్యాన్ని విస్మరించడం ఏ రకంగా న్యాయ సమ్మతం అని కౌన్సిల్ సమర్థించుకుంటుంది. ఆస్పత్రి యాజమాన్యాన్ని విస్మరించడంలో తాము ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని వారు ప్రజల ముందు ఎలా నిరూపించుకోగలరు? ఇలాంటి అరాచకమైన కార్పొరేట్ చికిత్సలకు మూలకారణాలు యాజమాన్యాలు అయినప్పుడు.. కంటితుడుపుగా డాక్టర్లమీద చర్య తీసుకుని చేతులు దులుపుకునే సంస్కృతివల్ల ఉపయోగం ఉంటుందా? అనే ప్రశ్నలకు కౌన్సిల్ సమాధానం ఇవ్వాలి.

Similar News