గుత్తాకు కేసీఆర్ పొగపెట్టేశారా...?

Update: 2017-11-08 07:30 GMT

నల్లగొండ రాజకీయాలు విచిత్రంగా కన్పిస్తున్నాయి. ఒకప్పటి శత్రువులు.. మిత్రులవుతున్నారు... మిత్రులు.. శత్రువులవుతున్నారు. అలాగే పార్టీలో చేరికలు పెరిగే కొద్దీ గ్రూపులు పెరిగిపోతున్నాయి. కొత్త నీరు వచ్చి పాతనీటిని పోగొడుతుందన్న చందంలా ఇప్పుడు పాత వారు పగ అయ్యారు. కొత్త వారు ముద్దయ్యారు. అసలు నల్లగొండ జిల్లాలో పార్టీల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా నల్లగొండ ఎంపీ గుత్తాకు ప్రధాన శత్రువును గులాబీ బాస్ అక్కున చేర్చుకున్నారు. ఇప్పటికే మంత్రి జగదీశ్వర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డిలు రెండు గ్రూపులుగా నల్లగొండ జిల్లా గులాబీ పార్టీని చీల్చేశారు. ఇప్పుడు తాజా పరిణామాలతో గుత్తా కొంత కినుక వహించినట్లు సమాచారం. తనకు ఆగర్భ శత్రువును పార్టీలోకి తీసుకోవడమే కాకుండా ఆ నేతకు పెద్దపీట వేయడాన్ని గుత్తా తప్పుపడుతున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వద్దనే తేల్చుకుంటానని ఆయన తన సన్నిహితుల వద్ద చెబుతున్నారట.

నల్లగొండలో మారుతున్న సమీకరణాలు....

నల్లగొండ జిల్లాలో రేవంత్ రెడ్డితో పాటు టీడీపీ నేతలు కొందరు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి ఆకర్ష్ స్టార్ట్ చేయాలని మంత్రి జగదీశ్వర్ రెడ్డికి చెప్పారు. దీంతో నల్లగొండలోని తెలుగుదేశం పార్టీలో కీలక నేత, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కంచర్ల భూపాల్ రెడ్డి సోదరులను మంత్రి జగదీశ్వర్ రెడ్డి పార్టీలోకి తీసుకొచ్చారు. వెంటనే భూపాల్ రెడ్డికి నల్లగొండ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమించారు. ఇది ఎంపీ గుత్తాకు మింగుడుపడనివిషయం. ఎందుకంటే భూపాల్ రెడ్డి బ్రదర్స్ కు గుత్తా బ్రదర్స్ కు ఎన్నాళ్ల నుంచో రాజకీయ వైరం నడుస్తోంది. వీరిది చిట్యాల మండలం ఊరుమడ్ల. గుత్తా, కంచర్ల కుటుంబాలకు గ్రామ స్థాయి నుంచే రాజకీయంగా విభేదాలున్నాయి. టీడీపీని వదిలి గుత్తా కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. కంచర్ల బ్రదర్స్ మాత్రం టీడీపీలోనే కొనసాగుతూ వచ్చారు. గత ఎన్నికల్లో భూపాల్ రెడ్డి కోమటిరెడ్డికి చుక్కలు చూపించారు. స్వల్ప ఓట్లమెజారిటీతోనే కంచర్ల ఓటమి పాలయ్యారు. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ కు చెక్ పెట్టడానికే కంచర్ల ను టీఆర్ఎస్ లోకి తీసుకొచ్చారు గులాబీ బాస్. అయితే ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి స్వయానా దుబ్బాక నరసింహారెడ్డిని తప్పించి కంచర్లను నల్లగొండ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమించడం గుత్తాకు మింగుడుపడటం లేదు. మొత్తం మీద నల్లగొండ అధికార పార్టీలో కంచర్ల చేరికతో విభేదాలు మరింత తీవ్రమయ్యాయనే చెప్పొచ్చు.

Similar News