కొత్త భయం : వెంకన్న సన్నిధికి పోలవరం డిజైన్లు!

Update: 2016-10-16 01:36 GMT

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మరో కీలకమైన ముందడుగు ఇవాళ పడబోతోంది. పోలవరం పనులను సకాలంలో.. అనుకున్న రీతిగా పూర్తి కావాలని కోరుతూ.. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోనున్నారు. పోలవరం డిజైన్లను స్వామివారి సన్నిధిలో ఉంచి , స్వామి కటాక్షం దక్కేలాగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పోలవరం సకాలంలో పూర్తయ్యేలా అనుగ్రహించాలన్నది శ్రీవారి ఎదుట మంత్రిగారి కోరిక.

పోలవరం ప్రాజెక్టు అనేది ... పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతానికి నీటి వనరుల పరంగా వరదాయినిలాగా అవతరిస్తుందనేది అందరూ అనుకుంటున్న మాట. గోదావరి నుంచి ఏటా వృథాగా సముద్రంలోకి పోతున్న అనేక టీఎంసీల నీటిని నిలువరించేలా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు భారీ మొత్తాల్లో టెండర్లు రివైజ్ చేయడం వంటి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే అంశాలు కూడా జరిగాయి. చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు మీద చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. అక్కడ డ్రోన్లు, అత్యాధునిక టెక్నాలజీ మరియు మెషినరీ ఉపయోగించి.. వేగంగా పనులు చేసేయడానికి కంకణం కట్టుకున్నాం అని చంద్రబాబు పదేపదే ప్రకటించారు.

నిజానికి ఇది జాతీయ ప్రాజెక్టు కాగా, కేంద్రమే నిర్మాణ బాధ్యతలు అన్నీ చూసుకోవాల్సి ఉంది. అయితే కేంద్రం చేతికి పూర్తిగా అప్పగించేస్తే నిర్మాణంలో జాప్యం చేస్తారనేది చంద్రబాబునాయుడు ఆరోపణ. అదే తానైతే ఎట్టి పరిస్థితుల్లోనూ 2018 చివరికెల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తాననేది ఆయన ప్రతిజ్ఞ. ఆ మేరకు ప్రతి సోమవారాన్ని పోలవరం వారం కింద ప్రకటించి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ.. అధికారుల మీద కేకలు వేస్తూ.. కాంట్రాక్టర్లను సానుభూతి తో చూడాలని వారికి హితవు చెబుతూ.. మొత్తానికి తన ప్రభుత్వానికి పోలవరం తప్ప మరో ఎజెండా లేదన్నంత స్థాయిలో సోమవారాల్లో ఆయన వ్యవహరిస్తున్నారు.

అయితే ఇప్పుడు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రాజెక్టు మెయిన్ డిజైన్లను తిరుమల వెంకన్న కటాక్షం కోసం తీసుకువెళ్లడం జరుగుతోంది. కాస్త లోతుగా పరిశీలిస్తే.. ప్రజలకు కొత్త భయం కలుగుతోంది. ఒకవైపు 2018 నాటికి అంటే మరో రెండేళ్లలో ఇంత భారీ ప్రాజెక్టు పూర్తి చేసేస్తా అని చంద్రబాబునాయుడు అంటున్నారు గానీ.. ఇప్పటికి డిజైన్లే ఫైనల్ కాలేదన్న మాట అర్థమై జనం భయపడుతున్నారు. ఇంకా డిజైన్లకు పూజలు చేయించుకునే దశలోనే ఉంటే.. ఈ డిజైన్లు కార్యక్షేత్రంలోకి వెళ్లేదెప్పుడు.. పనులు మొదలయ్యేదెప్పుడు.. అవి పూర్తయ్యేదెప్పుడు.. ఇదంతా రెండేళ్లలో అయ్యే పనేనా? అని జనంలో సందేహాలు తలెత్తుతున్నాయి.

కేంద్రం ప్యాకేజీ ప్రకటించిన తర్వాత.. నాబార్డు రుణం ఇప్పించడానికి కేంద్రం బాధ్యత తీసుకున్న తర్వాత నిధుల సమస్య కూడా తీరిపోయినట్లే అని.. జాతీయ ప్రాజెక్టే అయినప్పటికీ.. రాష్ట్రప్రభుత్వం దీని నిర్మాణాన్ని పర్యవేక్షించే ఏజన్సీలాగా పనిచేస్తుందని చంద్రబాబు ప్రకటించారు. అలా.. కార్పొరేట్ ఏజన్సీ కంటె సీరియస్‌గా ఆయన ఫాలో అప్ లు గట్రా చేస్తున్నారు. కానీ.. గడువులోగా అంటే 2018 ముగిసేలోగా నామ్ కే వాస్తే ఏదో రెండు కాలువల్లో నీళ్లు పారించి.. ఇక్కడితో ప్రస్తుతానికి సంతృప్తి చెందండి అని బురిడీ కొట్టించకుండా, పోలవరం మెయిన్ ప్రాజెక్టునే గనుక పూర్తిచేసినట్లయితే అది చంద్రబాబు సమర్థత కిందికే వస్తుంది. జనం ఆయన ప్రతిభను గుర్తిస్తారు. పోలవరంలో బ్రేకులు పడితే.. అదే ప్రజల నమ్మకం దృష్ట్యా ఆయనకు ఆత్మహత్యా సదృశం అవుతుంది.

Similar News