కేసీఆర్ ప్రతిపాదనలతో మధ్యతరగతికి పండగే

Update: 2016-11-18 21:33 GMT

8వ తేదీ తర్వాత.. ఏదో కొందరు మాత్రం తమ వద్ద రద్దయిన నోట్లు ఉన్నప్పటికీ.. డిసెంబరు 31 లోగా ఎన్నడయినా మార్చుకోవచ్చులే అని నింపాదిగా ఉండగలుగుతున్నారు గానీ.. చాలా మంది మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారికి ఆందోళనలు పెరుగుతున్నాయి. ఒక్కొక్కరు 2.5 లక్షల రూపాయలను తమ వ్యక్తిగత అకౌంట్లలో డిపాజిట్ చేసుకోవడానికి, అంతవరకు ఎలాంటి ఆంక్షలు ఐటీ దృష్టి లేకుండా అనుమతించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన వైనం తెలిసిందే. 2.5 లక్షల కంటె ఎక్కువ సేవింగ్స్ మొత్తాలు ఉన్నవారంతా కంగారు పడుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తమ ప్రభుత్వం ఎదుర్కొంటున్న నష్టాల భర్తీకి కేంద్ర సహకారాన్ని అర్థించడంతో పాటూ.. ప్రజల ఆందోళనల విషయంలో కొన్ని ప్రతిపాదనలతో ఇవాళ మోదీతో భేటీ కానున్నారు. కేసీఆర్ ప్రతిపాదనల్ని మోదీ ఆమోదిస్తే మాత్రం.. దేశంలో మధ్య తరగతికి పండగే అని చెప్పవచ్చు.

కేసీఆర్ ముఖ్యంగా తన నివేదికలో.. ప్రజల వద్ద 2.5 లక్షలకు మించి ఉండే ప్రతిరూపాయిని నల్లధనం అనే ముద్రతో చూడడం కరెక్టు కాదని అంటున్నారు. అది కేవలం అనౌకౌంటెడ్ సొమ్ము మాత్రమే అని.. మనదేశంలో ఇప్పటిదాకా డబ్బును ఖాతాల్లో కాకుండా విడిగా దాచుకునే అలవాటు ఎక్కువని, కాబట్టి.. 2.5 లక్షల కంటె ఎక్కువ ఉన్నా సరే.. ఇప్పుడు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోనివ్వాలని కేసీఆర్ కోరబోతున్నారు. రూ.10 లక్షలవరకు ఎలాంటి ఆదాయపు పన్ను ఆంక్షలు లేకుండా అనుమతించాలని అడగబోతున్నట్లు తెలుస్తోంది. అదే కార్యరూపంలోకి వస్తే గనుక.. చాలా మందికి గొప్ప ఊరట అవుతుంది.

Similar News