కేసీఆర్ గుర్రు : ఏడాది డెడ్‌లైన్ హుళక్కే!

Update: 2016-11-01 01:05 GMT

కేసీఆర్ స్వప్నం అంత సులువుగా తీరేలా కనిపించడం లేదు. ఏపీ చేతిలో ఉన్న సచివాలయ భవనాలను వెంటనే వెనక్కు తీసుకుని కూలగొట్టేస్తే.. మొత్తం అన్ని బ్లాకులను కూల్చేవాక సరికొత్త ఆకాశహర్మ్యం తెలంగాణ సచివాలయం కింద కట్టేద్దాం అని కేసీఆర్ నిర్ణయించారు. తనకు అనుకూలమైన వాస్తు విశేషాలతో ఆయన కొత్త హర్మ్యాన్ని నిర్మించుకోవాలనుకున్నారు. భవనాలరూపంలోనూ హైదరాబాదు నగరంపై తన ముద్ర ఉండాలని కోరుకున్నారు. అలాగే పాత ముద్రలను చెరిపేయాలని కూడా అనుకున్నారు. ఆరు లక్షల చదరపు అడుగుల్లో ఒకటే బ్లాక్ గా సెక్రటేరియేట్ భవనం కట్టడానికి డిజైన్లు ఓకే చేసి, శంకుస్థాపన ముహూర్తం పెట్టేశారు. ఒకవైపు తమ ప్రభుత్వానికి చెందిన కార్యాలయాలు అన్నిటినీ ఖాళీ చేయిస్తున్నారు.

ఏపీ సర్కారు నుంచి ఎలాంటి శషబిషలు లేకుండా సచివాలయం పుచ్చుకోవచ్చునని కేసీఆర్ భావించారు. గవర్నర్ నరసింహన్ కు పరిస్థితిని నివేదించి, ఆయన ఏపీ సర్కారుకు నచ్చజెప్పి భవనాలు తిరిగి తమకు ఇప్పించేయాలని కోరారు. ఆమేరకు నరసింహన్ కూడా చంద్రబాబుతో మాట్లాడడమూ జరిగింది. తొలుత చంద్రబాబు ఎప్రోచ్ కూడా ఇచ్చేసేలాగానే కనిపించింది. అయితే నిర్ణయం తీసుకోవాల్సిన కేబినెట్ భేటీ ముగిసే సమయానికి బ్రేకులు పడ్డాయి.

ఈ బ్రేకులు శాశ్వతం కాకపోవచ్చు. హక్కు ఉన్నది కదాని పదేళ్లపాటూ వారు ఉంచుకోకపోవచ్చు. కానీ ఈ ప్రభుత్వ పదవీ కాలం పూర్తయ్యేలోగా కొత్త సచివాలయ భవనాన్ని పూర్తిచేసి.. ఆ విషయాన్ని వచ్చే ఎన్నికలకు ఒక ప్రచార ఎలిమెంట్ గా వాడుకోవాలని అనుకున్న కేసీఆర్ కోరిక మాత్రం తీరే అవకాశం తక్కువగా ఉంది.

చంద్రబాబు కేబినెట్ భేటీలో నిజానికి సచివాలయం అప్పగింత వ్యవహారం చర్చకు వచ్చినప్పుడు మంత్రులు అంతో ఇంతో తం అభిప్రాయాలను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. భవనాల అప్పగింత విషయంలో ప్రజల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని , తెలంగాణ సర్కారు అడిగిన వెంటనే ఇచ్చస్తే ప్రజలు అపార్థం చేసుకుంటారని కొందరు మంత్రులు సూచించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో విభజన చట్టం కు సంబంధించిన అంశాలు తేలకుండా.. భవనాలు ఇచ్చేయడం కరెక్టు కాదనే అభిప్రాయం వెలిబుచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇలాంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన మంత్రులతోనే చంద్రబాబు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పటు చేశారు.

మరి ఈ సబ్ కమిటీ ఎప్పటికి నిర్ణయం తీసుకోవాలనే డెడ్ లైన్ ఏమీ లేదు. కనీసం కొన్ని నెలల పాటు అయినా.. వారు వ్యవహారం సాగతీస్తారని అనుకోవచ్చు. ఈలోగా విభజన చట్టంలోని ఆస్తుల పంపకానికి సంబంధించిన అంశాలన్నీ తేలాల్సిందేనని సబ్ కమిటీ పట్టుపట్టవచ్చు.

మొత్తానికి ఈ సచివాలయం అప్పగింత వ్యవహారంలో చంద్రబాబు ఇచ్చిన ట్విస్టుతో కేసీఆర్ స్వప్నం ఒకపట్టాన సాకారం అయ్యేలా కనిపించడంలేదు. ఈ విషయంలో కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ భవనాలు అందుబాటులోకి రాకుండ చేయగలిగింది ఏమీ లేదు. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ గవర్నర్ నరసింహన్ తో భేటీ అయి నివేదించడం తప్ప.. ఏపీ వైఖరి సజావుగా లేదని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

Similar News