కేజ్రీవాల్.. కులాల ప్రాపకం కోసం కొత్తగా వెంపర్లాట!

Update: 2016-10-17 03:28 GMT

‘చీపురు’ ను పార్టీ గుర్తుగా పెట్టుకుని , సివిల్ సర్వీసెస్ మాజీ అధికారిగా, అన్నా హజారే అనుచరగణంలో ఒకడిగా అరవింద్ కేజ్రీవాల్ ‘ఆమ్‌ఆద్మీ’ పార్టీతో రాజకీయ తెరంగేట్రం చేసినప్పుడు ఈ రంగంలో ఉన్న చెత్తనంతా ఆయన ఊడ్చిపారేస్తారని అందరూ ఆశించారు. ఢిల్లీలో అనూహ్యంగా ఆయనకు అధికారం కట్టబెట్టారు. కానీ కాలక్రమంలో ఆయన కూడా ఓ సాధారణ రాజకీయనాయకుడిగానే మారిపోయారా, సాంప్రదాయ మూస రాజకీయ వ్యూహాలకే పరిమితం అవుతున్నారా అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి.

ఢిల్లీలో అధికార పీఠం దక్కిన తర్వాత కేజ్రీవాల్ ఇతర రాష్ట్రాల మీద దృష్టిసారించే ప్రయత్నం చేస్తున్నారు. పంజాబ్ లో అధికారం దిశగా వెళ్లాలనే ఆలోచనతో అసెంబ్లీ ఎన్నికల మీద ఇప్పటికే ఫోకస్ పెట్టారు. యూపీ లో తమ ముద్ర కోసం తపిస్తున్నారు. అదే సమయంలో గుజరాత్ లో కూడా కేజ్రీవాల్ ర్యాలీలు నిర్వహిస్తూ.. అక్కడ భాజపా ప్రాభవానికి గండికొట్టడానికి తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు.

సరిగ్గా ఇదే సమయంలో గుజరాత్ ఆమ్ఆద్మీ పార్టీ బాధ్యుడిని పోలీసులు బందిపోట్లతో సంబంధాలు ఉన్నందుకు అరెస్టు చేశారు. ఇవన్నీ తమను బెదిరించే చర్యలు అంటూ కేజ్రీవాల్ మోదీనే దుమ్మెతితపోసారు. అందులో కూడా వింతేమీ లేదు.

ఇంతవరకు అంతా బాగానే ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి వ్యూహమే అనుసరిస్తుంది. అయితే గుజరాత్ ముంగిట్లో తన రాజకీయ సభల్లో కేజ్రీవాల్ స్థానికంగా అగ్రవర్ణాలకు రిజర్వేషన్లకోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్‌ను ఆకాసానికెత్తేస్తూ మాట్లాడడమే చర్చనీయాంశం అవుతోంది. కేజ్రీవాల్ తన ప్రసంగాల్లో అమిత్ షా దేశద్రోహి, హార్దిక్ పటేల్ దేశభక్తుడు అని ప్రస్తావించారు. అమిత్‌షా ను దూషించడం , దేశద్రోహిగా అభివర్ణించడం ఆయన ఇష్టం.. భాజపా నేతల్ని తిట్టడమే ఎజెండా గనుక తిట్టారని సరిపెట్టుకోవచ్చు. కానీ.. హార్దిక్ పటేల్ ను నెత్తికెత్తుకోవడం అంటే.. కేజ్రీవాల్ కూడా కులాల ప్రాతిపదికగా వర్గాలను అక్కున చేర్చుకుని గుజరాత్ లో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారా.... దేశ ప్రజలకు స్వచ్ఛ రాజకీయాలు రుచిచూపిస్తారని భావించిన కేజ్రీవాల్ కూడా కులాల కుంపట్ల మీద కుట్రలు చేస్తూ.. రాజకీయ ప్రయోజనాలకు కులాలను మెట్లుగా వాడుకునే ధోరణులకు లోబడిపోతారా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది.

Similar News