కూల్చివేతలకు కుటుంబరాజకీయాలకు లింకు!!

Update: 2016-11-07 08:50 GMT

ఒకసారి సెంటిమెంటు విషయానికి వచ్చిన తర్వాత.. ఏది నిజం? ఏది అబద్ధం? అనే అంశాలతో పెద్దగా నిమిత్తం లేదు! సెంటిమెంటు రాజ్యం చేస్తున్నదా? లేదా? అంతే!! ఆ కోణంలోంచి చూసినప్పుడు.. తెలంగాణ సచివాలయ భవనాలను కూల్చివేయాలనే నిర్ణయం వెనుక కేసీఆర్ సర్కారు బహిరంగంగా చెబుతున్న ఫైర్ సేఫ్టీ వంటి కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ... ప్రతిపక్షాలు ప్రధానంగా లేవనెత్తుతున్న కారణాలు మాత్రం.. కుటుంబ కలహాలకు బీజం వేసేలా కనిపిస్తున్నాయి. ఈ భవనాల సెంటిమెంటుతో ముడిపడి కేసీఆర్ కుటుంబంలో ఏమైనా పొరపొచ్చాలు ఉన్నాయో లేదో కానీ.. వారి మెదళ్లలోకి బలవంతంగా అలాంటి అభిప్రాయాలను చొప్పించడానికి విపక్షాలు తమ వంతుగా కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది.

తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత గురించి నిన్నటి తన పాదయాత్ర సందర్భంగా ప్రస్తావించిన రేవంత్ రెడ్డి.. తన కొడుకు సీఎం అయ్యే యోగం.. ఈ సచివాలయంలో పాలించిన 16 మంది ముఖ్యమంత్రులకు దక్కలేదు గనుకనే సీఎం కేసీఆర్ వీటిని కూలగొట్టించి 1200 కోట్లతో కొత్తవి కట్టించాలని అనకుంటున్నట్లుగా అనుమానాల్ని నాటేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే అంశాన్ని తమ భుజాల మీదికి ఎత్తుకుని మరింత విస్తృతంగా ప్రచారం చేయడానికి పూనుకుంటున్నది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ సచివాలయాన్ని కూలగొట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చి పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కూల్చివేతలను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని హెచ్చరిస్తున్నారు. సచివాలయ ప్రాంగణంలోని కొత్త భవనాలను కూడా కూలగొట్టించాలని అనుకుంటున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ మాటెత్తుతూ కేసీఆర్ కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయని అన్నారు. ఇదే సచివాలయం నుంచి చంద్రబాబునాయుడు లాంటి వాళ్లంతా పరిపాలించలేదా? అని ఉత్తంకుమార్ ప్రశ్నిస్తున్నారు. కూల్చివేతలపై కోర్టులో కేసు కూడా నడుపుతున్న కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సచివాలయం నుంచి వారసుడిగా అంటే.. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు మాత్రమే సీఎం అయ్యాడని, మరెవ్వరికీ ప్రధానంగా కొడుకులకు వారసత్వం దక్కలేదనే భయంతోనే కేసీఆర్ కూలగొట్టిస్తున్నాడని అంటున్నారు.

కేసీఆర్ కుటుంబంలో వారసత్వపు ఆధిపత్య పోరాటం కేటీఆర్ మరియు అల్లుడు హరీష్ రావు మధ్య ఉన్నదనే పుకార్లు ప్రబలంగా ఉండే సమయంలో.. హరీష్ రావు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండకుండా.. ఈ సచివాలయం కూలగొట్టించడదానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లుగా కాంగ్రెస్ నేతలు అనుమాన బీజాలు నాటుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏది ఏమైనా సెక్రటేరియేట్ విషయంలో కేసీఆర్ కల తీరడానికంటె ... వ్యవహారం నానా రచ్చరచ్చగా మారేలా కనిపిస్తోంది.

Similar News