కుక్కగా పుట్టినా బాగుండేది

Update: 2017-03-08 14:38 GMT

కుక్కగా పుట్టినా బాగుండు. మనిషిగా పుట్టేకంటే కుక్కై పుట్టడం మేలనుకుంటున్నారు ఈ సంగతి తెలిసిన జనం. దాదాపు ఐదు కోట్ల రూపాయల ఆస్తిని కుక్కల పేర రాసింది ఓ జంట. తమకు వారసులెవరూ లేకపోవడంతో తమకున్న ఆస్తిని కుక్కల పేరిటే రాసింది. ఇందుకోసం ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది. ట్రస్ట్ ద్వారా తమ తదనంతరం కూడా ఆ కుక్కలను బాగా చూసుకునేందుకే శునకరాజాల పేరిట ఐదు కోట్ల ఆస్తి రాసిచ్చేసింది ఈ కుటుంబం. ఈ సంఘటన ముంబయి లో జరిగింది.

కుక్కల పేరిట ఐదు కోట్ల ఆస్తి....

ముంబయిలో రమేష్ సుచ్ దే, నందిని సుచ్ దే దంపతులున్నారు. వీరికి సంతానం కలగక పోవడంతో కుక్కలను పెంచుకుంటున్నారు. వీరికి బడ్డీ, టైనీ అని నామకరణం కూడా చేశారు. వాళ్లకు కుక్కలతోటే లోకం. వాటిని కన్నబిడ్డల్లా చూసుకుంటారు. కుక్కలు తినే ప్లేట్లల్లోనూ వీరు తినేందుకు వెనుకాడరు. వారు తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటారు. అయితే మూడు కుక్కలను పెంచుకుంటున్న వీరికి ఒక కుక్క చనిపోయింది. దీంతో వీరికి తమ తదనంతరం ఈ రెండు కుక్కలకు దిక్కెవరన్న దిగులు పట్టుకుంది. దీంతో ఈ దంపతులిద్దరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. వీరికి కొలాబా, మస్జిద్ బందర్ ప్రాంతాల్లో రెండు ఫ్లాట్లు, కోల్ కత్తాలో ఒక అపార్ట్ మెంటు ఉన్నాయి. ఇవే కాకుండా గోల్డ్, నగదు అంతా కలిపితే దాదాపు ఐదు కోట్ల రూపాయల ఆస్తి ఉందని తేలింది. ఈ ఆస్తినంతటినీ కుక్కల పేరిట వేయాలని అనుకున్నదీ జంట. వెంటనే ఆలస్యం చేయకుండా కుక్కల పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి అందులో వేసేశారు. దాని ద్వారా వచ్చే ఆదాయంతో ఈ శునకరాజాల సంరక్షణ చూస్తున్నారు. కుక్కల ట్రస్ట్ సొమ్ములోనుంచి తాము కూడా ఒక్క పైసా కూడా తీసుకోలేని విధంగా నిబంధనలను రూపొందించుకున్నారు. ట్రస్ట్ ద్వారా ఈ కుక్కలకే కాకుండా ఎవరైనా వదిలేసి వెళ్లిన కుక్కల సంరక్షణ కూడా చూసే ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ఈ దంపతులు కుక్కల పేరిట ఐదు కోట్ల ఆస్తిని రాసిచ్చిన సంఘటన విని జనం ముక్కున వేలేసుకున్నారట. కుక్కగా పుట్టినా మేలని చమత్కరించుకున్నారట.

Similar News