కార్డ్ లావాదేవీలు నేర్పవలసింది ప్రజలకు కాదు!

Update: 2016-11-17 06:30 GMT

ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా చాలా పద్ధతిగా పారదర్శకంగా జరగాలంటే.. ప్రజల్లో నిజాయితీ పెరగాలంటే.. కార్డ్ లావాదేవీలు, ఆన్‌లైన్ లావాదేవీలను, మొబైల్ లావాదేవీలను పెంచాలని ఈ సమయంలో అందరూ సూచిస్తున్నారు. ఈ విషయంలో ప్రజల్లో చైతన్యం తేవడానికి, వారికి అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాలని చంద్రబాబునాయుడు లాంటి వారు సంకల్పిస్తున్నారు. ఈ నిర్ణయం చాలా మంచిది. కార్డు లావాదేవీలు పెరిగితే.. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా ప్రతి ఒక్కరూ యథేచ్ఛగా వాడుకం చేయగలరు. అయితే ఇక్కడ కీలకంగా ప్రభుత్వాలు గుర్తించాల్సింది ఏంటంటే.. కార్డు లావాదేవీల గురించి ప్రభుత్వాలు అవగాహన కల్పించాల్సింది ఎవరికి ? ప్రజలకా? వ్యాపార సంస్థలకా? ప్రజలు కార్డు తీసుకుని వెళ్లినంత మాత్రాన హోటల్లో టిఫిను పెట్టిన వాడు స్వైపింగ్ మెషిన్ లేదంటే ఏమైపోవాలి? అంటే ముందుగా ప్రతి వ్యాపార సంస్థ కూడా కార్డు లావాదేవీలు ఆమోదించే సాంకేతిక ఏర్పాట్లు చేసుకోవడాన్ని ప్రభుత్వాలు నిబంధనగా విధించాలి.

2 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. అలాంటి అరాచక వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలి. ఫలానా దుకాణంలో కార్డు ద్వారా పేమెంట్ చేయడానికి బిల్లుకంటె అదనంగా 2 శాతం అడిగారు అని ఎవరు ఫిర్యాదు చేసినా.. వారి మీద కఠిన చర్యలు ఉండాలి.

నిజానికి ప్రభుత్వాలు చిరు వ్యాపారులు, కిళ్లీ బంకులు వంటి వారి వద్ద కూడా సీసీ కెమెరాలు పెట్టిస్తూ దేశభద్రత కోసం పాటుపడుతున్నాం అంటూ బిల్డప్ ఇస్తూ బతుకుతున్నాయి. అదే కృషి నల్లధనం నియంత్రణలో ప్రజలకు వెసులుబాటు కల్పించాలి. చిరు వ్యాపారులు, కిళ్లీబంకుల దగ్గరినుంచి, కూరగాయల మార్కెట్లు, రైతుబజార్ ల వరకు, అతిశయోక్తి అనుకోకపోతే తోపుడు బళ్లలో కూడా స్వైపింగ్ మెషిన్లు ఉండేలా కొన్ని నిబంధనలు విధించాలి. దీనివలన ప్రజల్లో కార్డ్ లావాదేవీలు పెరుగుతాయి. కార్డ్ ఆధారితంగా లావాదేవీలు జరిగితే విక్రేతలనుంచి పన్నుల వసూళ్లు కూడా ప్రభుత్వానికి ఈజీ అవుతాయి.

ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే వాస్తవంగా అన్ని తరగతుల్లోని చిన్న పెద్ద వ్యాపారాలు అన్నిటికీ ఆన్ లైన్ , మరియు కార్డ్ లావాదేవీలు విధిగా ఉండే ఏర్పాటు చేస్తే చాలా సౌకర్యంగా , పారదర్శకంగా ఉంటుందని అనుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా చాలా వ్యాపారాల్లో కనీసం 100 రూపాయల లావాదేవీలు ఉంటే కార్డు ఆమోదించేలా అనుమతిస్తున్నారు. ఇలాంటివన్నీ లేకుండా.. ఎంత మొత్తం అయినా.. కార్డు ద్వారా బ్యాంకుకు చేరేదే గనుక.. చిన్న మరియు చిల్లర మొత్తాల్ని కూడా అనుమతించేలా ప్రభుత్వాలు నిబంధనలు తెస్తే భేషుగ్గా ఉంటుంది.

Similar News