కాటమరాయుడా....సిక్కోలు నరసింహుడా?

Update: 2017-01-02 10:48 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం సిక్కోలు జిల్లాలో పర్యటిస్తారు. అక్కడ కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిని పరామర్శిస్తారు. అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇప్పటికే శ్రీకాకుళంలో జనసేన కార్యకర్తలు పవన్ సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కేవలం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా కోస్తా, రాయలసీమ నుంచి కూడా పవన్ అభిమానులు శ్రీకాకుళానికి తరలి వచ్చే అవకాశముంది. శ్రీకాకుళం సభలో పవన్ ఎవరిని టార్గెట్ చేస్తారన్న చర్చ జరగుతోంది. ఇప్పటి వరకూ తిరుపతి, విశాఖ, అనంతపురం జిల్లాల్లో జరిగిన బహిరంగ సభల్లో పవన్ కమలనాధులనే టార్గెట్ గా ఎంచుకున్నారు. ప్రత్యేక హోదా కోసం పవన్ జిల్లాల వారీ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేక ప్యాకేజీకి ఓకే అన్న టీడీపీని కూడా వదలి పెట్టకూడదన్నది పవర్ స్టార్ ఆలోచనగా కన్పిస్తోంది. కేంద్రంతో అంటకాగుతూ ప్రత్యేక హోదా నినాదాన్ని సైతం పక్కన పెట్టిన తెలుగుదేశం పార్టీపై సిక్కోలు లో కాటమరాయుడు గర్జిస్తారని చెబుతున్నారు.

పవన్ పై ప్రెజర్...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఇటీవల కాలంలో తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. కేవలం బీజేపీనే విమర్శిస్తూ...టీడీపీని వదిలేయడం సరికాదని కొందరు కాపు సామాజిక వర్గ నేతలు పవన్ కు సూచించినట్లు తెలుస్తోంది. చంద్రబాబును పలు సందర్భాల్లో పవన్ పొగిడారు కూడా. ఆ విషయాన్ని కూడా వారు పవన్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. కాపులకు రిజర్వేషన్ కావాలంటూ ఉద్యమిస్తున్న ముద్రగడను ముప్పుతిప్పలు పెడుతున్న చంద్రబాబు పార్టీని ఎలా వెనకేసుకొస్తారని కూడా కొందరు కాపు పెద్దలు పవన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కేవలం కాపు సామాజిక వర్గమే కాకుండా సోషల్ మీడియాలో కూడా పవన్ వైఖరిపై కొంత వ్యతిరేకత కన్పిస్తోంది. దీంతో సిక్కోలు సభలో పవన్ టీడీపీని టార్గెట్ చేస్తారని చెబుతున్నారు. రాష్ట్రంలో పేదలకు శుభ్రమైన నీరు, భోజనం లేక అల్లాడుతుంటూ రాజధాని నిర్మాణమంటూ వేల కోట్లు తగలేయడమేంటని పవన్ ప్రశ్నించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా....కేంద్రం విదిల్చిన ప్యాకేజీని ఎలా తీసుకుంటారని సూటిగా పవన్ చంద్రబాబును ప్రశ్నించనున్నారు. కరె్న్సీ కొరతతో జనం అల్లాడుతుంటే డిజిటల్ లావాదేవీలపై బాబు చేస్తున్న ఫీట్లపై పవన్ సెటైర్లు వేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద రేపు సిక్కోలులో జరిగే సభలో పవన్ ఎలాంటి పంచ్ లు...ఎవరిపై విసురుతారో మరి కొద్ది గంటలు వేచిచూడాల్సిందే.

Similar News