కాంగ్రెస్ నేతలకు మెత్తగా క్లాస్ పీకిన గవర్నర్

Update: 2016-11-08 03:21 GMT

సచివాలయ ప్రస్తుత భవనాల కూల్చివేత, కొత్త భవనాల నిర్మాణానికి ప్రయత్నం అనే అంశంలో.. కాంగ్రెస్ పార్టీ సర్కారు నిర్ణయాలకు దూకుడుకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు కోర్టులో కేసు వేసి, న్యాయపోరాటం సాగిస్తూ ఉన్న టీకాంగ్రెస్ ఇతర ప్రయత్నాల్లో కూడా సర్కారు వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. గవర్నరును కలిసి వినతిపత్రం సమర్పించింది. సచివాలయం ముట్టడించాలని అనుకున్నప్పటికీ, దాన్ని వాయిదా వేసుకుని, 10వ తేదీన ధర్నా మాత్రం నిర్వహిస్తే చాలునని ఫిక్సయింది.

అయితే అభిజ్ఞవర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గవర్నర్ నరసింహన్ ను కలిసి సచివాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లినప్పుడు వారికి భిన్నమైన ప్రతిస్పందన ఎదురైనట్లు సమాచారం. తెలంగాణ అభివృద్ధి కోసం చేపడుతున్న నిర్మాణమే కదా.. ప్రతిదానిని అడ్డుకే ధోరణిలో వెళితే ఎలా.. అనే తరహాలో గవర్నర్ నరసింహన్ కాంగ్రెస్ నాయకులకు సుతిమెత్తగా క్లాసు పీకినట్లుగా తెలుస్తోంది.

నిజానికి కొత్త సచివాలయం నిర్మాణం విషయంలో సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు గవర్నర్ నరసింహన్ కు బ్రీఫింగ్ ఇచ్చారు. ఇస్తూనే ఉన్నారు. ఏపీ నుంచి వారి సచివాలయ భవనాలను తిరిగి తీసుకోవడానికి కూడా గవర్నర్ ద్వారానే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. నరసింహన్ అందుకు పూర్తిస్థాయిలో టీ సర్కారుకు సహకరిస్తున్నారు కూడా.. ! అలాంటి నేపథ్యంలో.. నిర్మాణాల్ని అడ్డుకోడానికి కాంగ్రెస్ నేతలు వెళ్లినప్పుడు నరసింహన్ పరోక్షంగా వారి వైఖరిని తప్పు బట్టినట్లు తెలుస్తోంది.

దీంతో కాంగ్రెస్ నాయకులు కూడా కాస్త దూకుడు తగ్గించినట్లు రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. క్రమంగా ఈ అంశం మీద ఫోకస్ తగ్గించి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఇతర సంక్షేమపథకాల మీద పోరాటాలు ముమ్మరం చేయాలని కాంగ్రెస్ అనుకుంటున్నట్టు సమాచారం.

Similar News