కడపలో ఒక్క ఓటు రేటు ఎంతో తెలుసా?

Update: 2017-02-28 13:30 GMT

కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో డబ్బులు, మద్యం ఏరులై పారుతున్నాయి. నామినేషన్లు పూర్తయిన అభ్యర్థులు ఇప్పుడు ఓటర్లపై దృష్టి పెట్టారు. క్యాంప్ లను అప్పుడే ఏర్పాటు చేసుకున్నాయి అధికార,ప్రతిపక్ష పార్టీలు. ప్రత్యర్థి శిబిరాల్లో వారిని ఆకట్టుకునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.

పట్టు నిలుపుకునేలా వైసీపీ...

ప్రతిపక్ష నేత జగన్ సొంత జిల్లా కావడంతో ఆయన ఈ ఎన్నికపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. తమ పార్టీకి మద్దతిస్తారని భావిస్తున్నారు. జగన్ ను సొంత జిల్లాలోనే దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అధికార తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తన పట్టును పెంచుకునేందుకు పావులు కదుపుతోంది. ఓటుకు లక్షల రూపాయలు ఇస్తామని రెండు పార్టీలు బహిరంగంగానే ప్రకటిస్తున్నాయి. టీడీపీ క్యాంప్ లో ఉన్న వారు తమకే ఓటు వేస్తారని వైసీపీ భావిస్తోంది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం తొలినాళ్లలో ఐదు లక్షల రూపాయలు పలికిన ఓటు ఇప్పుడు పదిహేను లక్షలకు చేరుకుంది. ఎంత ఖర్చైనా పెట్టి ఎమ్మెల్సీ స్థానాన్ని చేజిక్కించుకోవాలని రెండు పార్టీలూ పోటీ పడటం వల్లనే ఓటు కు నోటు రేటు బాగా పెరిగిందంటున్నారు. వైసీపీ తరుపున వైఎస్ వివేకానందరెడ్డి, టీడీపీ తరుపున బీటెక్ రవి పోటీ పడుతున్నారు.

గెలుపు తమదేనంటున్న టీడీపీ....

టీడీపీ నేతలు వంద ఓట్ల మెజారిటితో తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతల్లో ఆందోళన బయలుదేరింది. తమ క్యాంప్ నుంచి ఇద్దరు స్థానిక ప్రతినిధులను టీడీపీ తన్నుకు పోవడంతో వైసీపీలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఉన్నవారిని కాపాడుకునే ప్రయత్నంలో పడింది జగన్ శిబిరం. ఎవరు ఎక్కువ మొత్తం ఆశ చూపితే ఆ క్యాంప్ కు వెళ్లిపోవడంతో స్థానిక ప్రజా ప్రతినిధులపై ఏ పార్టీకీ నమ్మకం లేకుండా పోయింది. ఎవరు మన వారో...ఎవరు అవతలి వారో తెలియకుండా ఉంది పరిస్థితి. డబ్బులు తీసుకున్నా చివరి వరకూ రెండు పార్టీల నేతలకూ టెన్షన్ తప్పడం లేదు. ఆఖరి క్షణంలో హ్యాండిచ్చిన వారు కడప జిల్లాలో చాలా మంది ఉన్నారు. అందుకే పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా...టీడీపీలో కూడా భయం పట్టుకుంది. వైసీపీ కూడా తాము రెండు వందల ఓట్ల మెజారిటీతో గెలుస్తామనిచెబుతోంది. ఎవరి ధీమా వారిదే. కాని చివరకు ఎవరు గెలుస్తారో అనేది టెన్షన్ గా ఉంది.

Similar News