ఓ వారం రాజకీయాలు మానండి ప్లీజ్‌!

Update: 2016-09-22 13:02 GMT

హైదరాబాదు నగరం భారీ వర్షాలకు బాధిత నరకంగా మారిపోయింది. ఇక్కడి జనజీవనం ఛిద్రం అయిపోయింది. ఈ విషయంలో ఎవరి పాట్లు వారు పడుతున్నారు. ఎవరు చేయగలిగిన సాయం వారు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రాజకీయ నాయకులు మాత్రం.. ఇలాంటి సంక్లిష్టమైన సమయంలో కూడా.. ఎదుటి వారిని నిందించే తమకు అలవాటైన పద్ధతులను అనుసరిస్తుండడం జనానికి ఏవగింపు పుట్టిస్తోంది.

ఇప్పుడు నగరం ఎదుర్కొంటున్న దారుణమైన పరిస్థితికి తెలుగుదేశం కాంగ్రెస్‌ పార్టీలే కారణం అంటూ తెరాస ఎంఎల్‌సీ కర్నె ప్రభాకర్‌ ఆరోపణలు చేయడం సందర్భానికి తగినట్లు లేదని ప్రజలు భావిస్తున్నారు. నగరం చినుకు పడితే చిత్తడిగా మారుతోందని, విశ్వనగరం అంటే ఇదేనా అని విపక్షాలు విమర్శిస్తున్నాయని.. అది తగదని కర్నె తమను తాము సమర్థించుకున్నారు.

ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు తొలినింద అధికారంలో ఉన్న వారి మీదనే వస్తుంది తప్ప.. మరో రకంగా జరగదు. అయితే ప్రజలు ఒకవైపు నానా పాట్లు పడుతూ ఉంటే వాటిని నివారించడం గురించి, వారిని ఆదుకోవడం గురించి ఆలోచించడం మానేసి.. తెరాస సర్కారున తిట్టడం గురించి, వారి మీద ఎదురుదాడుల గురించి కర్నె వంటి నాయకులు మాట్లాడుకుంటూ ఉంటే ప్రజలకు ఎంత కడుపు మండుతుంది?

అందుకే కనీసం ఇలాంటి సంక్షోభ సమయాల్లో అయినా నాయకులు రాజకీయాలను మరిచి, వివేకం పాటించాలని.. నిందలు లాంటివి ఎదురైనా సరే.. తాత్కాలికంగా పట్టించుకోకుండా.. తమ దృష్టి మొత్తం జనజీవనాన్ని తిరిగి గాడిలో పెట్టడం గురించే ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News