ఒక్క ఛాన్స్‌ ప్లీజ్.....అంటూ....

Update: 2017-02-13 22:30 GMT

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ వెలువడనుంది. మెజార్టీ స్థానాల్లో గెలిచేందుకు తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తోంది. బిజేపికి కేటాయించనున్న స్థానంపై ఒకటి రెండు రోజుల్లో టిడిపి స్పస్టత ఇవ్వనుంది. అయితే యూటిఎఫ్, ఏపిటిఎఫ్ నుంచి టిడిపి గట్టిపోటీని ఎదుర్కోనుంది. వైకాపా రాయలసీమలో కొంత ప్రభావం చూపే అవకాశం ఉండగా ఉత్తరాంధ్ర లో దాని ప్రభావం నామమాత్రంగా ఉండనుంది. ఏపీలో మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ కానుంది. గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలైన శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం స్థానం, ప్రకాశం-నెల్లూరు- చిత్తూరు స్థానం, కడప -అనంతపురం - కర్నూలు స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, ప్రకాశం- నెల్లూరు-చిత్తూరు టీచర్స్ ఎమ్మెల్సీ, కడప-అనంతపురం- కర్నూలు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఐదు స్థానాలకు ఇవాళ్టి నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 23 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. మార్చి 9న పోలింగ్‌ జరగనుండగా.. మార్చి 15న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.

గెలుపు కోసం కసరత్తులు...

అధికార తెలుగుదేశం పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కడప-కర్నూలు-అనంతపురం పట్టభద్రుల స్థానానికి కేజే రెడ్డిని, ఉపాధ్యాయ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్యను టీడీపీ తమ అభ్యర్థులుగా ప్రకటించింది. పట్టభద్రుల స్థానానికి వామపక్షాల అభ్యర్థిగా గేయానంద్ పోటీపడుతున్నారు. ఉపాధ్యాయ స్థానానికి ఎస్టీయూ నుంచి కత్తి నరసింహారెడ్డి, ఏపిటిఎఫ్ నుంచి రఘురామయ్యలు పోటీపడుతున్నారు. ఇక నెల్లూరు-ప్రకాశం-చిత్తూరు పట్టభద్రుల స్థానానికి వేమిరెడ్డి పట్టాభిరామి రెడ్డి ని టిడిపి ప్రకటించగా.. యూటిఎఫ్ నుంచి శ్రీనివాస్ రెడ్డి పోటీ పడుతున్నారు. నెల్లూరు-ప్రకాశం-చిత్తూరు ఉపాధ్యాయ స్థానానికి యూటిఎఫ్ సిట్టింగ్ ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యంను తిరిగి పోటికి దింపింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంను తమకు కేటాయించాలని బిజేపి పట్టుపడుతుండగా, టీడీపీ మాత్రం నెల్లూరు-ప్రకాశం-చిత్తూరు ఉపాధ్యాయ స్థానాన్ని ఆఫర్ చేస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.

Similar News