ఒకే విడత రుణమాఫీ సాధ్యమేనా?

Update: 2016-11-07 03:25 GMT

తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి, లేదా కేసీఆర్ సర్కారును తిట్టిపోయడానికి, తూర్పారపట్టడానికి వేరే అంశాలే లేవన్నట్లుగా విపక్షాలు రెండూ ఒకే అంశాన్ని పతాకస్థాయిలో లేవనెత్తాయి. అటు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు రెండూ ఒకేసారి.. ఒకే డిమాండును వినిపిస్తున్నాయి. తద్వారా పాలకపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేయగలం అని వారు అనుకుంటున్నారేమో గానీ.. తమ డిమాండులో తర్కబద్ధమైన వాదన ఉన్నదా లేదా అనే ఆలోచన వదిలేసినట్టున్నారు. ప్రజలు కూడా తమ సొంత వివేచనతో కొంతైనా ఆలోచిస్తారని, అచ్చంగా విపక్షాలు ధ్వజమెత్తినంత మాత్రాన ప్రభుత్వ వ్యతిరేక దృక్పథం ఏర్పరచుకుంటారని అనుకోవడం భ్రమ.

రైతులకు ప్రకటించిన రుణమాఫీని ఒకేసారి చేసేయాలంటూ అదే ప్రధాన డిమాండ్ గా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒకవైపు పాదయాత్ర ప్రారంభించారు. మరోవైపు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అచ్చంగా అదే డిమాండ్ ను వినిపిస్తున్నారు. అయితే ఇద్దరు నేతలూ కూడా తమ డిమాండ్ లో ప్రాక్టికాలిటీ ఉందా అనే అంశం జోలికి వెళ్లడం లేదు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి అన్నట్లుగానే విమర్శ కోసం విమర్శ.. పోరాటం కోసం పోరాటం అన్నట్లుగా ఉన్నది తప్ప.. రుణమాఫీ ఒకే దఫా చేసేయడం సాధ్యమేనా? అనేది వారు ఆలోచించడం లేదు. అయినా పొరుగున ఉన్న ఏపీలో తెలుగుదేశం కూడా ఒకే దఫాలో మాఫీ చేసే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు ఆ డిమాండ్ తో కేసీఆర్ సర్కారు రైతులకు ద్రోహం చేస్తున్నట్లుగా నిందలు వేసే నైతిక హక్కు తమకు ఎలా వస్తుందని రేవంత్ రెడ్డి తదితరులు భావిస్తున్నారో అర్థం కాని సంగతి.

రైతులకు ఎక్కడైనా రుణాలు రాని పరిస్థితి ఉన్నా.. ఇప్పటికే పీసీసీ, తెదేపా కూడా పోరాటం చేస్తున్నట్లు విద్యార్థులకు ఫీజు రీఇంబర్స్ మెంట్ విషయంలో అన్యాయం జరుగుతూ ఉన్నా నిర్దిష్టంగా వాటిపై పోరాడితే ఫలితం ఉంటుంది. అంతే తప్ప.. ఏదో జనాంతికంగా.. ఒకే దఫా రుణమాఫీ చేసేయాలి లాంటి పడికట్టు డిమాండ్ల వల్ల.. కాలయాపన తప్ప వాస్తవంలో జరిగేది ఏమీ ఉండదని ప్రజలు అనుకుంటున్నారు.

Similar News