ఒక మంచి ప్రయత్నానికి ఈ బ్రేకులెందుకో మరి!

Update: 2016-11-18 06:29 GMT

బ్యాంకుల నుంచి నగదు మార్పిడి ద్వారా ఒకే వ్యక్తులు పలుమార్లు లబ్ధి పొందకుండా, ఎక్కువ మంది వినియోగదార్లకు అవకాశం కల్పించే ఉద్దేశంతో.. చూపుడు వేలి మీద సిరా గుర్తు వేసే పద్ధతిని కేంద్ర ఆర్థిక శాఖ తీసుకువచ్చింది. దీనివల్ల నిజానికి ఎక్కువ సంఖ్యలో ప్రజలకు నగదు మార్చుకునే అవకాశం కలుగుతుందనడంలో సందేహం లేదు. బ్యాంకుల వద్ద రద్దీ కూడా ఎంతో కొంత మేర తగ్గుతుందనడంలోనూ ఆశ్చర్యం లేదు. అయితే.. కేవలం ప్రజల సౌకర్యార్థం కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి ఎన్నికల కమిషన్ మోకాలడ్డుతుండడం విశేషం. ఎన్నికల సిరా గుర్తు వేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషన్ కేంద్ర ఆర్థిక శాఖకు ఓ లేఖ రాసింది.

బ్యాంకుల్లో ఎన్నికల సిరా గుర్తును వాడవద్దంటూ వాళ్లు సూచిస్తున్నారు. దీనివల్ల దేశంలో త్వరలో ఉప ఎన్నికలు జరగబోయే ప్రాంతాల్లో ఇబ్బంది ఏర్పడుతుందంటూ ఎన్నికల కమిషన్ పేర్కొనడం విశేషం. తమిళనాడు రాష్ట్రంతో పాటు దేశంలో పలుచోట్ల త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.

అయితే.. ఎన్నికల కమిషన్ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు అంత సబబుగా లేవని పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే.. నల్లధనం కట్టడి అనే పెద్ద యజ్ఞం జరుగుతున్నప్పుడు, అందువల్ల అనేక మంది అనేక రకాల ఇబ్బందులను సహిస్తూనే ఉన్నారు. అనేక రకాల ప్రభుత్వ శాఖలు తమకు రకరకాల ఇబ్బందులు, నష్టాలు వస్తున్నా భరిస్తున్నాయి. ఇన్ని జరుగుతుండగా.. ఎన్నికల కమిషన్ మాత్రం.. ఇలాంటి సిరా వాడాలనే చిన్న నిర్ణయానికి మోకాలడ్డడం చిత్రంగా ఉంది. ఎందుకంటే.. ఒకసారి పోలింగ్ జరిగిన తర్వాత.. రీపోలింగ్ జరిగితే సిరా గుర్తు విషయంలో ఏం చేస్తున్నారు? మరోవేలికి ముద్ర వేసేలా ఆదేశాలు ఇస్తున్నారు. ఇప్పుడు బ్యాంకుల్లో వేస్తున్న వేలికి కాకుండా మరో వేలికి వేయాల్సిందిగా ఎన్నికల్లో ఆదేశాలిస్తే సరిపోతుంది కదా.. కొన్ని నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికల మిష మీద దేశవ్యాప్తంగా ప్రజలకు వెసులుబాటు కల్పిస్తున్న మంచి నిర్ణయాన్ని అడ్డుకోవడం ఎందుకు అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.

Similar News