ఏదో ఊహించుకుని తమ గోతిని తామే తవ్వుకున్నారు

Update: 2016-10-12 02:11 GMT

కేంద్ర రాజకీయాలను ఇప్పుడు ‘సర్జికల్ దాడులు’ అనే పదం ఆకర్షించినంతగా మరేదీ ఆకర్షిస్తున్నట్లుగా లేదు. పాకిస్తాన్ మీద సర్జికల్ దాడులు జరిగిన వెంటనే అన్ని పార్టీలు ఏక రీతిగా స్పందించినప్పటికీ.. మోదీకి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో అని కొందరు తర్వాత ఆందోళన చెందారు. సైన్యపు నెత్తుటి త్యాగాల వెనుక మోదీ దాక్కుని ఉన్నారంటూ రాహుల్ తనకు తోచిన వ్యాఖ్యానాలు మినహా.. ఇంకా .. ఆ విషయంలో విమర్శల జోలికి వెళ్లడం లేదు. సర్జికల్ దాడుల ఆధారాలను చూపించాలనే డిమాండ్‌ను వినిపించడం లేదు. ఆ కోణంలోంచి హస్తిన వాతావరణం నిశ్శబ్దంగా మారినట్లే భావించాలి.

అయితే ఇక్కడ ఒక పరిణామాన్ని గమనించాల్సి ఉంది. సర్జికల్ దాడులకు మద్దతు ఇచ్చేసిన తర్వాత రాహుల్, కేజ్రీవాల్ లాంటి వాళ్లకు ప్రధానంగా ఓ భయం కలిగింది. దాడులు ఎలాగైనా జరిగి ఉండొచ్చు గాక.. కానీ, రాబోయే పంజాబ్, యూపీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న మోదీకి ఎడ్వాంటేజీని దెబ్బతీయడానికి మాత్రమే వారు విమర్శలకు దిగారనేది సత్యం. అయితే వారు అనుకున్న లక్ష్యాన్ని ఎంతమేరకు సాధించారో గానీ.. ఆ దామాషాలో తమకు ఎన్నికల్లో ఉండే అవకాశాలను మాత్రం కోల్పోయారనేది గమనించాల్సిన విషయం.

సర్జికల్ దాడులతో ముడిపెట్టి మోదీని విమర్శించడానికి వీరు మరొక మార్గాన్ని ఎంచుకుని ఉండాల్సింది. కానీ దాడులే అబద్ధం అన్న మార్గాన్ని ఎన్నుకోవడం అనేది వారికి చేటు తెచ్చింది. ఎందుకంటే.. సర్జికల్ దాడులు లేదా, సైన్యం యాక్టివిటీ పెరగడం వంటి చర్యల యొక్క తీవ్రత సాధారణ జనజీవితం మీద ఎంత ప్రభావం చూపిస్తోందో , ఆ నరకం ఎలా ఉంటుందో.. సరిహద్దు రాష్ట్రాల ప్రజలకు చాలా బాగా తెలుసు. అంటే ప్రస్తుతం ఎక్కడైతే ఎన్నికలు జరగబోతున్నాయో అంటే పంజాబ్, యూపీ రాష్ట్రాలమీద సరిహద్దు ఉద్రిక్తతల తీవ్రత , అక్కడి ప్రజలకే ఎక్కువగా తెలుస్తుంది. అందుకే.. సర్జికల్ దాడులు వంటి సైనిక చర్యలను అనుమానించడం, ఆ రూపేణా అవమానించడం ప్రజలకు కూడా కోపం తెప్పిస్తుంది. ఆ కోణంలోంచి చూసినప్పుడు.. సాక్ష్యాలు కావాలంటూ, వీడియోలు చూపించాలంటూ అడగడం ద్వారా కేజ్రీవాల్,కాంగ్రెస్ పార్టీలు తమకు ఎన్నికల్లో ఉండే అవకాశాలను పలుచన చేసుకున్నాయని అర్థమవుతుంది.

యూపీలో కాంగ్రెస్ నామ్ కే వాస్తే పోటీచేయాల్సిందే తప్ప.. అధికారం మీద ఆశ ఎప్పుడో లుప్తమైపోయిన పార్టీ అది. అక్కడ కేజ్రీవాల్ బలం కూడా తక్కువే. కానీ పంజాబ్ విషయంలో కేజ్రీవాల్ కు ఆశలు ఉండేవి. పంజాబ్ లో ఏకంగా అధికారంలోకి రాగల ఛాన్సు ఉందని ఆయన ఆశ పడ్డారేమో కూడా. కాకపోతే.. ఇప్పుడు ఈ అనుమానాల రూపంలో వారికి ఉన్న అవకాశాలు మొత్తం హరించుకుపోయినట్లే భావించాలి. యూపీలో కూడా సర్జికల్ దాడులను శంకించేలా మాట్లాడుతూ ముందుకు వెళ్లినంత కాలం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తగ్గిపోతూ ఉంటాయని వారు తెలుసుకోవాలి. మోదీకి ఎడ్వాంటేజీ దక్కకుండా ఏదో చేయబోయి.. కేజ్రావాల్, రాహుల్ లు తమ గోతిని తామే తవ్వుకున్నట్లుగా తయారైందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Similar News