ఎన్నారైల్ని జగన్‌ తుపానుసాయం కోరుతారా?

Update: 2016-09-24 23:07 GMT

రాష్ట్రేతర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగువారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల మీద వారి ప్రభావం కూడా సహజంగానే పెరుగుతోంది. ప్రత్యేకించి విదేశాలలో ఉండే తెలుగువారిలో తమ పార్టీల పట్టు పెంచుకోవడానికి అన్ని పార్టీలూ తమదైన పద్ధతిలో ప్రయత్నిస్తుంటాయి. తెలుగుదేశం అనేక ఎన్నారై ఫోరంలను నిర్వహిస్తుంటుంది. తరచూ తెదేపా నాయకులు విదేశాల్లో పర్యటిస్తూ.. ఎన్నారైల్లో పార్టీ పట్ల సానుకూలతను పెంచుతుంటారు. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష నేత జగన్మోహనరెడ్డి ఆదివారం నాడు సాయంత్రం 8.30 గంటలకు ఎన్నారైలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

తెలుగుదేశం మాదిరిగానే అమెరికాలో వైకాపాకు కూడా మంచి ఫాలోయింగ్‌ ఉంది. పెద్ద సంఖ్యలో పార్టీకి, జగన్‌కు అభిమానులు ఉన్నారు. అక్కడి అభిమానుల సంఘాలు కలిసి.. జగన్‌ తో ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటుచేశాయి. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జగన్‌ ఎన్నారైలతో మాట్లాడేలా.. ఆ మొత్తం కార్యక్రమాన్ని సాక్షి టీవీలో లైవ్‌ ద్వారా ప్రసారం చేసేలా ఏర్పాటు చేశారు.

అయితే వీరితో మాట్లాడడంలో జగన్‌ ఎజెండా ఏమిటి? ఏమై ఉంటుంది? అనేవి కీలకాంశాలుగా ఉన్నాయి. ప్రత్యేకహోదాపై వైకాపా పోరాటం ఉధృతం చేస్తున్న నేపథ్యంలో.. ఎన్నారైల మద్దతు ఆ దిశగా కూడగట్టవచ్చు. అయితే ఇక్కడ క్రియాశీలంగా జరగవలసిన పోరాటానికి ఎన్నారైలు అక్కడినుంచి చేసేది పెద్దగా ఉండదు. అదే సమయంలో జగన్‌ సోమవారం నుంచి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. వీరికి సాయం చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని వైకాపా ఆరోపిస్తోంది. ఆ నేపథ్యంలో వరద బాధితులకు సాయం చేయాల్సిందిగా జన్‌ ఎన్నారైలకు పిలుపు ఇస్తారా అనేది కీలకం. జగన్‌ పిలుపు ఇస్తే.. పెద్ద సంఖ్యలో విరాళాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే జగన్‌ ఏయే అంశాలను ప్రధానంగా వారితో మాట్లాడుతారో చూడాలి.

Similar News