ఎదుర్కొనలేనప్పుడు.. ఎదురుదాడే శరణ్యమా?

Update: 2016-12-16 03:45 GMT

డిఫెన్సివ్ గా ఉండడానికి మన వద్ద సరైన లాజిక్ లేదనుకోండి... అఫెన్సివ్ గా వెళ్లిపోవడమే ఆధునిక యుద్ధనీతి. రాజకీయాల్లో మాత్రం ఈ సిద్ధాంతం అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే.. వైరి పక్షాలు మనల్ని విమర్శిస్తూ ఉన్నప్పుడు.. వారు చేసే విమర్శలకు మన వద్ద సమాధానం లేనప్పుడు... వారిని ఎదుర్కొనడం మనకు చేతకానప్పుడు.. ఇక ఎదురుదాడికి దిగడమే! వారి తప్పులను వెతుక్కుని వాటిమీద విరుచుకుపడుతూ వారి నోర్లు మూయించే ప్రయత్నం చేయడమే పద్ధతిగా కొనసాగుతోంది.

నోట్ల రద్దు వలన ప్రజలు కష్టాలు పడుతున్న మాట వాస్తవం. అయితే ప్రభుత్వం తమ వలన ప్రజలు కష్టాలు పడుతున్నారనే వాస్తవాన్ని అంగీకరిస్తే సరిపోతుంది. అయితే అందుకు వారికి ఈగో అడ్డు వస్తున్నట్లుగా కనిపిస్తోంది. వారలా ఒక్కసారి ఆమోదించి, అందుకు కొన్ని కారణాలు చెప్పుకోగలిగితే.. ఇక ప్రతిపక్షాల జోరు కూడా తగ్గుతుంది. కానీ.. పాలకపక్షమూ ఆ విషయంలో మొండిగానే వ్యవహరిస్తూ వచ్చింది.

తాజాగా వారికి అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర అనేది అనువుగా చేతికి చిక్కింది. త్యాగి అరెస్టు కావడమూ, రాజకీయ నాయకులకు కూడా ముడుపులు ఇచ్చినట్లుగా కొన్ని ఆధారాలు దొరకడమూ.. మన్మోహన్ సింగ్, అప్పటి కార్యదర్శికి కూడా విచారణ నిమిత్తం నోటీసులు జారీ కావడమూ ఇలాంటి వ్యవహారాలు అన్నీ అవకాశంలాగా కలిసి వచ్చాయి. దాంతో భాజపా సచివులు ఇప్పుడు విపక్ష కాంగ్రెసు మీద విరుచుకుపడుతున్నారు.

పార్లమెంటులో నోట్ల రద్దుపై చర్చకు తాము సిద్ధమే.. అయితే ముందుగా అగస్టా వెస్ట్ లాండ్ పై చర్చ జరగాలి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అయితే ఇలాంటి మాటలు.. ఏదో తర్కం కోసం మీడియా ముందు ప్రకటించడానికి శుభ్రంగా ఉంటాయే గానీ.. వాస్తవానికి ప్రజలను మెప్పించడానికి ఉపయోగపడవు అని భాజపా నాయకులు తెలుసుకోవాలి.

ఎందుకంటే.. దేశవ్యాప్తంగా ప్రజలు స్వయానా కష్టాలు పడుతున్న మాట వాస్తవం. నానా యాతనలు పడుతున్నారు. అలాంటి వారికి తమ బాధల గురించి పార్లమెంటులో చర్చ జరిగిందంటే రుచించినంతగా.. తమ సాధారణ దైనందిన జీవితంతో నిమిత్తం లేని అగస్టా కుంభకోణం మీద చర్చ అంటూ ఊరించాలని చూస్తే ఆకట్టుకుంటుందా? ప్రభుత్వం ఆలోచించాలి. నోట్ల రద్దు మీద చర్చకు అనుతించి.. ఆ విషయంలో ప్రభుత్వం నిబద్ధతతోనే, నిజాయితీతోనే ఉన్నదని, ప్రతిపక్షాల ఆరోపణలు నిరాధారమని వారు చాటుకోగలగాలి. అప్పుడే వారికి మన్నన దక్కుతుంది.

Similar News