ఈ సీఎంలను కామెంట్ చేస్తే కటకటాలేనా?

Update: 2017-02-20 18:29 GMT

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి సోషల్ మీడియా పెద్ద చికాకులే తెచ్చి పెడుతోంది. నిత్యం సీఎం స్థాయి వ్యక్తులపై సోషల్ మీడియా వేదికగా గంటకో పోస్ట్., నిమిషానికో పేరడీ చూడ్డానికి సరదాగానే ఉంటాయి. కానీ ఇకపై వాటిని పోస్ట్ చేసే వారికి మాత్రం చికాకులు తప్పవు. ఇప్పటికే రెండు రాష్ట్రాల పోలీసులు అలంటి పనులు చేస్తున్న వారిపై దృష్టి పెట్టారు.

బాబుపై ఫొటోలను మార్ఫింగ్ చేసి...

సామాజిక మాధ్యమాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఫొటోలను మార్ఫింగ్‌ చేస్తూ అసభ్యంగా ప్రచారం చేస్తున్న వ్యక్తులపై ఏపీ హౌసింగ్‌బోర్డు ఛైర్మన్‌ వర్ల రామయ్య పోలీసులకు ఫిర్యాదుచేశారు. సీఎం ఫొటోను మార్ఫింగ్‌ చేసి ఆయనకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టింగ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలోకి వచ్చిందని, ఇలాంటి పోస్టింగ్‌లతో రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయవాడ సంయుక్త పోలీస్‌ కమిషనర్‌ హరికుమార్‌ను కలిసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదుచేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన వివరించారు.

కేసీఆర్ మీద చేసినా...

అటు సోషల్‌ మీడియాలో కేసీఆర్‌మీద, ప్రభుత్వంమీద జరుగుతోన్న దుష్ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్‌ను కాని, ప్రభుత్వాన్ని కాని దూషిస్తూ ఎలాంటి పోస్టులు అప్‌లోడ్‌ చేసినా కటకటాల వెనక్కి వెళ్లాల్సిందేనని హెచ్చరిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగం సిద్దం చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత పేరుతో ప్రతిపక్షాలు, కొంత మంది సోషల్‌మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు అప్‌లోడ్ చేస్తున్నారని, ఈ పోస్టులపై ఎప్పటికప్పుడు ప్రత్యేక పోలీసు నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఇలాంటి పోస్టులు ఆరోగ్యకరం కాదని ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా సాధించుకోవాలని, అంతే కాని ఇలా ఒకరిని కించపరిచే విధంగా పోస్టింగులు అప్‌లోడ్ ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదని అధికారులు సూచిస్తున్నారు. పోస్టింగ్ లు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు కూడా.

Similar News