ఈ ప్రొఫెసర్ కు కాంగ్రెస్ ఎందుకు భయపడుతోంది?

Update: 2017-01-24 08:38 GMT

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోదండరామ్ ను టార్గెట్ చేస్తోంది. తెలంగాణ రాజకీయ జేఏసీ కారణంగా తమకు ముప్పు పొంచి ఉందని గ్రహించిన హస్తం పార్టీ జేఏసీపై కూడా విమర్శలు చేయాలని నిర్ణయించుకున్నట్లుంది. వచ్చే ఎన్నికల్లో కోదండరామ్ సారధ్యంలో కొత్త పార్టీ పుట్టుకొస్తే ఓట్లు చీలిపోయి అది అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారుతుందని టి.కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకుంది. అందుకే ఇక జేఏసీని కూడా టార్గెట్ చేయాలని భావిస్తోంది.

జేఏసీకి నెట్ వర్క్ లేదా?

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో చాలా స్పష్టంగా ఈ విషయాన్ని బయటపెట్టారు. తెలంగాణ జేఏసీకి రాష్ట్రంలో నెట్ వర్క్ లేదన్నారు. జేఏసీ ఉద్యమసమయంలో ఉన్నట్లు లేదని, చాలా బలహీన పడిందని వ్యాఖ్యానించడం హస్తం పార్టీ వ్యూహమేమిటో తెలిసిపోయింది. ఇన్నాళ్లూ జేఏసీ చేసిన కార్యక్రమాలకు టీపీసీసీ మద్దతిస్తూ వచ్చింది. ఇటీవల కోదండరామ్ ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన ధర్నాను ప్రభుత్వం అడ్డుకుంటే ఆయన ఇంట్లోనే దీక్షకు దిగారు. కాంగ్రెస్ నేతలంతా ఆయనింటికి వెళ్లి సంఘీభావం ప్రకటించి వచ్చారు. మరోవైపు కోదండరామ్ కాంగ్రెస్ మనిషేనని టీఆర్ఎస్ నేతలు కూడా విమర్శించారు. అయితే వచ్చే ఎన్నికల్లో కోదండరామ్ మద్దతును తీసుకుని ఎన్నికల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ భావించింది. అయితే కోదండరామ్ కొత్త పార్టీ పెడతారన్న వార్తలు రావడంతో టి.కాంగ్రెస్ ఇప్పడు పునరాలోచనలో పడింది. అందుకోసమే భవిష్యత్తులో కోదండరామ్ ను టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కొత్త పార్టీపై కసరత్తులు....

ప్రొఫెసర్ కోదండరామ్ కొత్త పార్టీ పెడతారని ఇటీవల వార్తలొస్తున్నాయి. అందుకోసం భారీగానే కొందరు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో పొలిటికల్ స్పేస్ ఉందని గుర్తించిన కొందరు మేధావులు ఈ మేరకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ కు తెలంగాణలో సరైన నాయకత్వం లేకపోవడం, బీజేపీ రాష్ట్రంలో బలహీనంగా ఉండటంతో కొత్తపార్టీకి ఎక్కువ అవకాశాలున్నట్లు గుర్తించారు. దీంతోనే కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. కోదండరామ్ పార్టీ ఎక్కువగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓట్లనే చీల్చే అవకాశాలుంటాయని వారు భావిస్తున్నారు. అందుకోసమే కోదండరామ్ పై మాటల దాడిని పెంచాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇది మరి కాంగ్రెస్ కు లాభిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.

Similar News