ఇలా చేస్తే ముందుముందు అల్లర్లకు చెల్లుచీటీ!

Update: 2016-11-07 15:57 GMT

ప్రభుత్వ వ్యతిరేకతతో ఎవరు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలను చేపడుతూ ఉన్నా సరే.. ముందుగా ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, దహనం వంటి చర్యలకు పాల్పడడం అనేది అనాదిగా మన దేశంలో వస్తున్న సాంప్రదాయం. అయితే మారుతున్న టెక్నాలజీ విలువలు, మారుతున్న పోలీసుల ధోరణి, మారుతున్న ఉద్యమాల స్వరూపం .. మారుతున్న చట్టాలు... వీటన్నింటి నేపథ్యంలో ముందుముందు ఇలాంటి ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం వంటి అల్లర్లకు చెల్లుచీటీ తప్పదని పలువురు అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వ ఆస్తుల విద్వంసాలకు ఆందోళన కారులు పాల్పడినప్పుడు సుప్రీం కోర్టు తీర్పులు , గైడ్ లైన్స్ ను అనుసరించి.. అల్లర్లు చేసిన వారినుంచే వాటిల్లిన నష్టపరిహారాన్ని వసూలు చేస్తాం అంటూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు సోమవారం నాడు మీడియాకు వెల్లడించారు. తుని లో కాపుల ఐక్యగర్జన సందర్భంగా అదుపు తప్పిన ఉద్యమం విధ్వంసంలోకి దిగిన సంగతి తెలిసిందే. రైళ్లను , పోలీసు వాహనాలను తగుల బెట్టడం వంటి అనేక దుశ్చర్యలకు పాల్పడ్డారు. అయితే పోలీసులు వీడియో ఫుటేజీల సహాయంతో అచ్చంగా నేరాలకు , అల్లర్లకు పాల్పడిన వ్యక్తులు ఎవరో గుర్తించి వారిని అరెస్టు చేసి విచారించడం జరిగింది.

ఇప్పుడు ఆయా అల్లర్లకు పాల్పడిన వారినుంచే జరిగిన నష్టాన్ని కూడా సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం రాబడతాం అంటూ డీజీపీ సాంబశివరావు అంటున్నారు. తుని అల్లర్ల వ్యవహారం కావొచ్చు, మరోటి కావచ్చు.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన వ్యక్తులనుంచి పరిహారం వసూలు చేయడం అనేది ఒకసారి జరిగితే చాలు.. ముందు ముందు అల్లర్లకు పాల్పడే ఆకతాయి మూకలు కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తాయని ఆశించవచ్చు. తమ నిరసనలు తెలియజేయడానికి, అల్లర్లకు, విధ్వంసాలకు మధ్య తేడా ఉన్నదని.. తాము తమ హద్దులెరిగి ప్రవర్తించాలని బహుశా వారికి తొందర్లోనే ఒక క్లారిటీ రావొచ్చు.

Similar News