ఇదేంది? ఈ పార్టీ ఏంది?

Update: 2017-12-22 09:30 GMT

క్రమశిక్షణకు మారుపేరంటారు. తోక జాడిస్తే తాట తీస్తామంటారు. కట్టుబాటు తప్పితే వేటు వేస్తామంటారు. ఇది తెలుగుదేశం పార్టీ అధినేత నిత్యం చేసే వ్యాఖ్యలు. కాని డోన్ట్ కేర్ అంటున్నారు తెలుగుతమ్ముళ్లు. వీధి పోరాటాలకు సిద్ధమయ్యారు. ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ముఠాలు, కుమ్ములాటలతో అట్టుడికిపోతోంది. అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల కాలంలో ఎన్నో సంఘటనలు. అయినా ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడంతో నేతలు మరింత రెచ్చిపోతున్నారు. ఒకరిపై ఒకరు బహిరంగంగా దూషించుకుంటున్నారు. ఎన్నడూలేని విధంగా పార్టీలో గ్రూపులుగా ఏర్పడి నానా రభస చేసేస్తున్నారు.

అనేక జిల్లాల్లో....

అనంతపురం, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,గుంటూరు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు కట్టుబాట్లు తప్పుతున్నారు. ఆధిపత్య పోరుకోసం బాహాబాహీకి దిగుతున్నారు. ప్రకాశం జిల్లాను తీసుకుంటే ఎమ్మెల్సీ కరణం బలరాం, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ల మధ్య వీధిపోరు ఆగలేదు. రెండు వర్గాలూ బాహాబాహీకి దిగుతున్నాయి. అధినేత జోక్యం చేసుకున్నా ఒకరిపై ఒకరు ఇప్పటికీ కారాలు మిరియాలు నూరిపోసుకుంటున్నారు. ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి సమయం కోసం వేచిచూస్తున్నారు.

నేతలు తిరుగుబాటు చేస్తున్నా...

ఇక గుంటూరు జిల్లాలోనూ మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి మిగిలిన ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. ఎంపీతో కూడ సఖ్యత లేదు. ఇక ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబు సంగతి సరేసరి. ఆయనపై తెలుగుదేశం పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. రావెల కూడా అందుకు తగ్గట్లుచంద్రబాబు వ్యతిరేక వర్గంతో చేయి కలుపుతున్నారు. రావెలపై చర్య తీసుకుంటామని పార్టీ చేసిన హెచ్చరికలు ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. దీంతో రావెల టీడీపీ ప్రత్యర్థి వర్గంతో పూసుకు తిరగడం మానలేదు. అలా అని పార్టీని వీడనూ లేదు. దీంతో గుంటూరు జిల్లాలోనూ అదే పరిస్థితి

జేసీ చెప్పిన మాట విని...

ఇక అనంతపురం జిల్లా తీసుకుంటే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీనికి ప్రధాన కారణం తన ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే గురునాధరెడ్డిని టీడీపీలోకి జేసీ తీసుకురావడమే. అప్పటి నుంచి విభేదాలు రోడ్డుకెక్కాయి. మూడు రోజుల క్రితం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనంతపురంలోని మొరం వంకను పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురంలో అభివృద్ధిని కొందరు దెయ్యాలా, భూతాల్లా అడ్డుపడుతున్నారని పరోక్షంగా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గురించి వ్యాఖ్యానించారు. దీంతో ఎమ్మెల్యే వర్గమైన మేయర్ స్వరూప జేసీ దివాకర్ రెడ్డిని రాక్షసుడిగా సంభోధించారు. దీంతో జేసీ అనుచరుడు ఫోన్లో మేయర్ ను, ఎమ్మెల్యేను బండబూతులు తిట్టారు. దీంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ గడప తొక్కింది.

ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల వల్లనేనా?

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ మంత్రి పీతల సుజాతకు, ఎంపీ మాగంటి బాబుకు మధ్య విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. పీతలకు వ్యతిరేకంగా మాగంటి వర్గానికి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు రాజీనామా చేసేంత వరకూ వ్యవహారం వచ్చింది. అయితే ఈ అంశాన్ని కూడా అధిష్టానం దిద్దుబాటు చేయలేకపోయింది. ఇక ఇదే జిల్లాలో బీజేపికి చెందిన మంత్రి మాణిక్యాలరావుకు, జడ్పీ ఛైర్మన్ వర్గానికి మధ్య పడటం లేదు. అధిష్టానం వైఖరిని నిరసిస్తూ ఏకంగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్నే టీడీపీ నేతలు బహిష్కరించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకోవడం వల్లనే కొన్ని చోట్ల పరిస్థితి అధినాయకత్వం చేయి దాటి పోతున్న పరిస్థితి ఏర్పడింది. ఇతర పార్టీల నుంచి వచ్చని నాయకులు ఎక్కడ తమను డామినేట్ చేస్తారోనని, వారితో ముందు నుంచే వైరం పెట్టుకుంటున్నారు. ఇక క్రమశిక్షణ... కట్టుబాటు అన్నది తెలుగుదేశం పార్టీలో కేవలం విన్పించే మాటలేనన్నది వాస్తవం.

Similar News