ఇది మానిన గాయాన్ని కెలకడం కాదా?

Update: 2016-10-19 01:15 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్‌తో సభలో నిరసనలు వ్యక్తం చేస్తూ, సభా కార్యక్రమాలకు అడ్డం పడిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 12 మందికి శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీచేశారు. వీరు సభా హక్కులను ఉల్లంఘించారంటూ, హక్కుల కమిటీ ఎదుట హాజరైన తమ తమ వివరణలు చెప్పుకోవాల్సిందిగా వీరికి తాజాగా మంగళవారం నోటీసులు సర్వ్ అయ్యాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగితే కూడా.. అదేదో నేరమైనట్లుగా ఇలా నోటీసులు ఇచ్చి వేధిస్తారా అంటూ వైకాపా నాయకులు ఇప్పుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

అయితే వర్షాకాల సమావేశాల్లో సభలో వ్యవహరించిన తీరుకు సంబంధించి ఇన్నాళ్ల తర్వాత.. వైకాపా సభ్యులకు హక్కుల సంఘం నోటీసులు ఇవ్వడం అనేది మానిన గాయాన్ని కెలికినట్లుగా ఉన్నది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక సమయంలో హోదా కోసం ఉధృతంగా కార్యక్రమాలు నిర్వహించిన వైకాపా ఆ తర్వాత చాలా సైలెంట్ గా మారిపోయింది. ఇటీవలి కాలంలో.. నెల్లూరు జిల్లా కసుమూరు దర్గా వద్ద ప్రత్యేకహోదా రొట్టెను మొక్కు గా సమర్పించుకోవడం తప్ప.. జగన్ కూడా హోదా అంశాన్ని ప్రస్తావించిన సందర్భం లేదు. ఇలా ఈ విషయాన్ని ఆ పార్టీనే క్రమంగా మరచిపోతున్నదని పలువురు భావిస్తున్నారు.

ఇలాంటి సమయంలో.. పాత గాయాన్ని రేపుతున్నట్లుగా ఎన్నడో అసెంబ్లీలో వ్యవహరించిన దానికి ఇప్పుడు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే అసెంబ్లీలో ఇదివరకు వ్యవహరించిన తీరుకు వైకాపా ఎమ్మెల్యే రోజా ఏడాది కాలం పాటు సస్పెన్షన్ శిక్షను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు ఏకంగా 12 మందికి నోటీసులు ఇచ్చారు. వీరి మీద కూడా సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు ఉంటాయా? లేదా, వీరి వివరణలు తీసుకుని హెచ్చరించి వదిలేస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. వైకాపా నాయకులు మాత్రం ఈ నోటీసులకు సంబంధించి స్పీకరు మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. వైకాపా సభ్యులను వీలైనంత మందిని తెదేపాలో చేర్చేసుకున్నారని, ప్రభుత్వాన్ని నిలదేసే వారందరినీ సభలో లేకుండా చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నోటీసుల వ్యవహారం ముందు ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Similar News