ఇది కేసీఆర్‌ సర్కారు వైఫల్యం కాదా?

Update: 2016-10-02 10:31 GMT

కేసీఆర్‌ సర్కారు వైఫల్యాలను ఎవరైనా ఎత్తిచూపితే.. వారికి రాజకీయ దురుద్దేశాలను ఆపాదించి, వారి మీద విరుచుకుపడడంలో గులాబీ దళాలు సిద్ధహస్తులు. తెలంగాణ ప్రగతి నిరోధకులంటూ కొత్త పదాన్ని కూడా అందుకు వారు తయారుచేశారు. అయితే కొన్ని సందర్భాల్లో వారి పరిపాలన సజావుగా సాగడం లేదనడానికి సంశయాలు అక్కర్లేదు.

తాజాగా .. వర్షబీభత్సం యావత్‌ రాష్ట్రాన్ని కొన్ని రోజుల పాటు ఇబ్బంది పెట్టింది. నగరేతర ప్రాంతాల్లో పడిన వర్షాన్ని 'పాజిటివ్‌' ఖాతాగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. నగరంలోని వర్షాలను అలా అభివర్ణించడానికి ఆస్కారం లేనంతగా, ఇక్కడ ప్రజాజీవనం ఛిద్రమైంది. విపత్తు నిర్వహణ, నాలాల నిర్వహణ, ఆక్రమణలు ఇత్యాది అనేక అంశాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. కేసీర్‌ ప్రభుత్వం జనాలు పడుతున్న ఇబ్బందులు సమస్తం పాత ప్రభుత్వాల పాపమే అని నిందించింది. అక్కడితే తమ చేతులు దులిపేసుకోవచ్చునని వారు అనుకున్నారు. కానీ.. రెండున్నరేళ్లలో వాళ్లు ఏం చేసినట్లు? ఏం పట్టించుకున్నట్లు? ఈ ప్రశ్నలు జనంలోనూ వచ్చాయి.

ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. వర్షం కాస్త తెరపి ఇచ్చి ఎండరాగానే కేసీఆర్‌ సర్కారు తొలి ప్రాధాన్యంగా చేపట్టిన పనులేమిటి? అనేది ఇప్పుడు కీలకం. పెద్ద పెద్ద గోతుల మయంగా మారిన మెయిన్‌ రోడ్లను చక్కదిద్దడం గురించి కూడా వారు పట్టించుకోలేదు. ముందుగా ఆక్రమణల కూల్చివేత మీదికి వెళ్లారు. ఆక్రమణల కూల్చివేత అవసరమే. ఆ విషయంలో ప్రభుత్వం దృఢంగా వ్యవహరించడం అభినందనీయమే. కానీ.. మళ్లీ అలాంటివి పుట్టుకు రాకుండా అనుమతులిచ్చే యంత్రాంగాన్ని నిప్పులతో కడగాల్సిన అవసరం ఉంది. దాదాపు 800 నిర్మాణాల్ని ఆక్రమణలను అధికారులు కూల్చివేశారు.

అయితే అదే దామాషాలో రోడ్లను తాత్కాలికంగానైనా బాగు చేశారా అంటే లేదు. ప్రాధాన్యక్రమంలో తొలుత మెయిన్‌ రోడ్లు తర్వాత గల్లీ రోడ్లు ఇలాగైనా ఒక ప్రణాళిక ప్రకారం ప్రొసీడ్‌ అవుతున్నారా? అంటే అదీ లేదు. వర్షాలు తగ్గి నాలుగు రోజులైనా.. మెయిన్‌ రోడ్లు కూడా .. ఇంకా భయంకరమైన గోతులమయంగానే ఉన్నాయి. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి.. రోజుకు 1700 గోతులు పూడుస్తున్నాం అని అధికారికంగా సెలవిచ్చారు.

ఎంత సిగ్గు పడాల్సిన విషయం ఇది. ప్రజలకు సౌకర్యం కల్పించడం తొలి ప్రాధాన్యం కావాల్సిన ఒక ఉన్నతాధికారి.. ఉన్న యావత్తు యంత్రాంగాన్ని , సర్వశక్తులను మోహరించి.. ఒకటి రెండురోజుల్లో నగరంలోని సకల రోడ్లను తాత్కాలికంగా కనీసం చదును చేయించి.. (మరమ్మతు రోడ్లు, కొత్త రోడ్ల పేరిట వందల కోట్ల రూపాయలను కాంట్రాక్టర్ల ఖాతాల్లో కుమ్మరించడం సంగతి తరువాత) జనాలకు హితం చేయాల్సిన అధికారి చెప్పాల్సిన మాటలేనా అవి! రెండు రోజుల్లో అన్ని రోడ్లు బాగుచేసి.. తర్వాత.. మరింత దూకుడుగా ఆక్రమణల కూల్చివేత మీదకు వెళ్లి ఉన్నా.. జనం అంతా అభినందించేవారు. ఆ పనికి ఉన్న యంత్రాంగం , వారికి ఈ పనికోసం లేకుండా పోయారా? అనేది ప్రశ్న. మరి అధికార్ల దృష్టిలో ప్రజాహితం కంటె.. కూల్చివేతలు వంటి వాటికే అగ్రప్రాధాన్యం ఉండడం జనం ఖర్మం. కేసీఆర్‌ వంటి సీనియర్‌ నేత సీఎం, స్వయంగా అడ్డగోలుగా తమ చర్యలను వెనకేసుకువస్తోంటే ఏ అధికారులైనా ఇంతే ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తారన్నది సత్యం. ఆ విషయాన్ని కేసీఆర్‌ ప్రభుత్వమూ, జనం దృష్టిలో ఈ మొత్తం వ్యవహారాలకు జవాబుదారీగా నిలవాల్సిన మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ లు తెలుసుకోవాలి.

Similar News