ఆస్తుల పంపకానికి ఇది శ్రీకారం అవుతుందా?

Update: 2016-11-08 10:59 GMT

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాష్ట్ర విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలోని ఆస్తుల పంపకం అనేది క్లిష్టమైన చిక్కుముడిలాగా మారుతోంది. ఒకరికి సత్వరం ఆస్తులు పంచేసుకోవాలని, తమ వాటాకు ఏం వస్తుందో పుచ్చేసుకోవాలని ఆరాటం, మరొకరికేమో.. అన్నీ మన ఆధీనంలోనే ఉన్నాయి కదా.. పంచడానికి ఇప్పుడే తొందరేముందిలే అనే నింపాదితనం. ఇలాంటి నేపథ్యంలో .. రెండు రాష్ట్రాలూ రెండు భిన్న కోణాల్లో ఆలోచిస్తుండగా.. ఆస్తుల విభజన అనేది ఖచ్చితంగా చిక్కుముడిలాగానే మారుతోంది. ఇలాంటి నేపథ్యంలో హస్తినలో శ్రీకారం అన్నట్లుగా హోంశాఖ వారి పూనికతో ఆస్తుల విభజన జరగబోతోంది.

ఢిల్లీలో ఏపీ భవన్ ను రెండు రాష్ట్రాల మధ్య పంపకాలు చేపట్టడానికి కేంద్ర హోం శాఖ ఈనెల 15వ తేదీన ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి తప్పక రావాల్సిందిగా రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కూడా వర్తమానం పంపారు. ఏపీ భవన్ విభజన విషయంలోనూ రెండు రాష్ట్రాల వైఖరుల మధ్య చిన్న వివాదం నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఏపీ భవన్ ను పూర్తిగా తమకు ఇచ్చేస్తే.. దానికి బదులుగా ఢిల్లీలోనే మరో ఖాళీస్థలం ఏపీకి కేటాయిస్తాం అంటూ గతంలో తెలంగాణ ప్రభుత్వం వాదించింది. అయితే దీనికి ఏపీ ససేమిరా ఒప్పుకోలేదు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు హోంశాఖ ఆధ్వర్యంలో 15వ తేదీన జరగబోయే సమావేశంలో ఎలాంటి చర్చలు నడుస్తాయో, ప్రతిష్టంభన ఏర్పడుతుందో ఏమో చూడాల్సి ఉంది. సమావేశం ముగిసిన వెంటనే హోంశాఖ తమ నిర్ణయాన్ని వెలువరిస్తుందని ప్రాథమికంగా వార్తలు వస్తున్నాయి.

ఇది ఆదిగా అన్నీ జరుగుతాయా?

రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం గొడవలు చాలా ఉన్నాయి. నిజానికి హైదరాబాదులోని ఏపీ సచివాలయం ను వారు ఖాళీచేసి వెళ్లిపోయినా కూడా.. ఆ ఖాళీ భవనాలను తెలంగాణకు అప్పగించేయడంలో.. మీనమేషాలు లెక్కిస్తూ మంత్రివర్గ సబ్ కమిటీ వేసి.. నాన్చుతూ ఉండడానికి కారణం కూడా.. ఇతర ఆస్తుల పంపకాలు ఒక కొలిక్కి రావడం లేదన్న పాయింటు గురించే అన్నది అందరికీ తెలిసిన సంగతే. సచివాలయం ఖాళీ భవనాలు తమకు అప్పగించేయాలని కేసీఆర్ గవర్నర్ వద్దకెళ్లి అడిగినప్పుడెల్లా.. ఏపీ సర్కారు ఆస్తుల పంపకాన్ని తెరమీదకు తెస్తున్నది.

ఇప్పుడు హోంశాఖ పూనికతో ఏపీ భవన్ పంపకాలు జరగబోతున్నాయి. ఇది ఆదిగా అన్ని ఆస్తుల పంపకాలు కూడా పూర్తయిపోతే.. రెండు రాష్ట్రాల మధ్య కీలకమైన ఒక ఘట్టం ముగిసినట్లు అవుతుంది. అయితే.. సమస్యలను నానబెట్టి కోతిపుండు బ్రహ్మరాక్షసిగా మార్చే అలవాటు ఉన్న మన నాయకులు.. అంత వేగంగా సమస్యలు ఒక కొలిక్కి వచ్చేయడాన్ని ఇష్టపడతారో లేదో చూడాలి.

Similar News