ఆలూ చూలూ లేకున్నా సమీక్షలు మాత్రం షురూ!

Update: 2016-10-02 05:01 GMT

మనందరికీ వారం రోజులు అంటే ఏడు రోజులు కానీ చంద్రబాబునాయుడు పరిస్థితి వేరు. ఆయనకు ఇక మీదట వారం అంటే అయిదురోజులు మాత్రమే. ఎందుకంటే.. ఆయన తన షెడ్యూలులో రెండు రోజుల్ని ఇప్పటికే త్యాగం చేసేశారు. అవును సోమవారం రోజును ఆయన ఇప్పటికే పోలవరం సమీక్షకు కేటాయించారు. అక్కడి పనుల పురోగతిని సమీక్షించడానికి సోమవారం గడచిపోతుంది. ఇక తాజాగా అమరావతి రాజధాని పనులకు చంద్రబాబు బుధవారాన్ని కేటాయించారు. రాజధానిలో రోడ్ల నిర్మాణం గురించి నిర్వహించిన సమీక్ష సమావేశంలో చంద్రబాబు ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.

అయితే ఇక్కడ ఓ విషయాన్ని గమనించాల్సి ఉంది. పోలవరం పరిస్థితి వేరు. నెమ్మదిగా అయినా సరే.. అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ, అమరావతిలో ఇప్పటిదాకా ఏమీ లేదు. కానీ పనులు వేగం పుంజుకోవాల్సిన మూడ్‌ అటు అధికార్ల వర్గాలు, పనులు కాంట్రాక్టులు తీసుకున్న ఇతర వర్గాల్లో ఏర్పడేందుకు అన్నట్లుగా చంద్రబాబునాయుడు అప్పుడే సమీక్షలు ప్రారంభించడం, ప్రతి బుధవారం సమీక్ష ఉంటుందంటూ ఓ నిర్దిష్టమైన ఎప్రోచ్‌ తో వెళుతుండడం మంచిదే.

ప్రస్తుతానికి రాజధాని 6 లైన్ల రోడ్లు మూడు, మిగిలినవి అన్నీ నాలుగులైన్ల రోడ్లు గా నిర్మించాలనేది ప్రతిపాదనగా సమీక్ష గురించిన వార్తలను బట్టి తెలుస్తున్నది. అయితే రోడ్ల నిర్మాణానికి మ్యాప్‌ ఖరారు అయిందా? ఏ ప్రాంతంలో ఏ రోడ్డు రానున్నదో, ఏ చోట ఏ భవనం రానున్నదో ఖరారు చేశారా? అనేవి ఇంకా సందేహాలే. రాజధానిలో రహదారుల ఎత్తు ఎంత ఉండాలో నిర్ణయించేందుకు నియమించిన ఆర్కాడిస్‌-టాటా అనే సంస్థ నివేదిక ఇవ్వాల్సి ఉన్నదని.. వారి నివేదిక వచ్చిన వెంటనే రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

అయితే ఆర్కాడిస్‌ - టాటా ఎప్పుడు నివేదిక ఇస్తుంది. ఏపీ సర్కారు ఆ సంస్థకు ఏమైనా డెడ్‌ లైన్‌ విధించిందా? లేదా? అనేవి కీలకాంశాలు. చంద్రబాబునాయుడు సహజంగా అధికారుల్ని ఎంతగా వెంటపడి పనులు చేయిస్తారో.. అంతగా తాను మెచ్చి పనులు అప్పగించిన అవుట్‌సోర్సింగ్‌ సంస్థల విషయంలో ఉపేక్షిస్తారనే ప్రచారం బాగా ఉంది. అవి అపోహలని నిరూపించాలంటే.. ఇలాంటి నివేదికలు జాప్యంలేకుండా వచ్చేలా ప్రభుత్వం స్పీడప్‌ చేయించాలి. తద్వారా రోడ్ల నిర్మాణం వంటి అన్ని పనులూ వేగం పుంజుకునే అవకాశం ఉంటుంది.

Similar News