ఆమెది తొందరపాటు...ఆయనది పొరపాటు

Update: 2017-02-09 14:30 GMT

తమిళరాజకీయాల్లో ఇద్దరు అన్నాడీఎంకే నేతల మధ్య జరుగుతున్న వార్ ను తప్పుపడుతున్నారు. ఇద్దరిదీ తప్పేనంటున్నారు. పన్నీర్ సెల్వం పొరబాటు చేశారని, శశికళ తొందరపడ్డారని అంటున్నారు. తమిళ రాజకీయాలు ఉత్కంఠను రేపుతున్నాయి. గవర్నర్ రాకతో రాజ్ భవన్ కు సీన్ మారింది. ఇన్ చార్జి గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. రెండు వర్గాలూ తమకే బలం ఉందని చెబుతుండటంతో గవర్నర్ ఎటు వైపు మొగ్గు చూపుతారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అసలు అన్నాడీఎంకేలో అమ్మ మరణం తర్వాత ఈ పరిస్థితులు తలెత్తడానికి దారితీసిన పరిణామాలను గమనిస్తే....

రాజీనామా ఎందుకు చేశారు?

పన్నీరు సెల్వం జయలలిత మరణించిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. డిసెంబరు 5వ తేదీన అమ్మ మరణిస్తే వెంటనే పన్నీర్ కు సీఎం పీఠాన్ని అప్పగించారు అన్నాడీఎంకే నేతలు. అయితే తర్వాత పన్నీర్ సెల్వం దగ్గరుండి మరీ శశికళను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి ప్రతిపాదించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి అంటే నెక్స్ట్ ఏంటి? అన్నది పన్నీర్ గుర్తించలేదా? తర్వాత తన కుర్చీకే ఎసరు వస్తుందని పన్నీర్ గ్రహించలేకపోయారా? సరే. ఈ నెల 5వ తేదీన శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అందులో కూడా పన్నీర్ శశికళ పేరునే శాసనసభ పక్ష నేతగా ప్రతిపాదించారు. అంటే తాను సీఎం పదవి నుంచి తొలగిపోయినట్లే కదా? మరి అప్పటి వరకూ మౌనంగా చిన్నమ్మ చెప్పినట్లు విన్న పన్నీర్ కేవలం 48 గంటల్లో ఎందుకు మనసు మార్చుకున్నారు. అమ్మ తనతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని మధుసూదన్ కు ఇవ్వమని చెప్పిందని పన్నీర్ చెబుతున్నారు. మరి ఆరోజు పన్నీర్ ఎందుకు అభ్యంతరం చెప్పలేదు. కనీసం శాసనసభ పక్ష నేతగా ఎన్నుకునే సమయంలోనైనా తాను ప్రొటెస్ట్ చేసుండాల్సింది. బయటకు వచ్చి తన నిరసనను తెలియజేయాల్సింది. కాని పన్నీర్ అలా చేయలేదు. చిన్నమ్మ చెప్పినట్లుగానే రాజీనామా సమర్పించారు. ఆ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఇంతటి స్థితిని ఓపీఎస్ కావాలనే కొనితెచ్చుకున్నట్లయింది. ఆరోజే తన అభ్యంతరాను చెప్పి ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని చెప్పి ఉంటే పన్నీర్ మాటకు విలువుండేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రాజీనామ చేసిన తర్వాత వచ్చి తిరుబాటు బావుటా ఎగరేయడాన్ని కొందరు తప్పుపడుతున్నారు.

ఆరు నెలలు ఆగలేకపోయారా?

ఇక శశికళ కూడా తొందరపడ్డారు. కనీసం పన్నీర్ ను ఆరు నెలల పాటు సీఎంగా కొనసాగనివ్వాల్సింది. పన్నీర్ పోయెస్ గార్డెన్ కు అత్యంత విధేయుడిగా మాత్రమే కాకుండా తన సామాజిక వర్గ నేత కూడా కావడం చిన్నమ్మకు అనుకూల అంశమే. చిన్నమ్మ చెప్పినట్లే పన్నీర్ నడుచుకునే వారు. పన్నీర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ అధికారులు, మంత్రులు పోయెస్ గార్డెన్ కు క్యూ కట్టిన సంగతిని అందరం చూశాం. యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్లు ఏకంగా పోయెస్ గార్డెన్ కు వెళ్లి శశికళతో భేటీ కావడం వివాదం కూడా అయింది. ఇంత పట్టు ఉంచుకుని కూడా హడావిడిగా పన్నీర్ ను సీఎం కుర్చీ నుంచి దించి తాను పట్టాభిషేకం చేయించుకోవాలను కోవడాన్ని తప్పుపడుతున్నారు. కొంత కాలం టైం ఇచ్చి...ఎమ్మెల్యేలను దగ్గరకు తీసి సమయం వచ్చినప్పుడు సీఎం కుర్చీ ఎక్కేందుకు ప్రయత్నించి ఉంటే చిన్నమ్మ పని సాఫీగా జరిగి ఉండేదని.... ఆమె తొందరపాటే చేటు తెచ్చిపెట్టిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద అన్నాడీఎంకేలో చిన్నమ్మ తొందరపాటు...పన్నీరు పొరపాటు కారణంగానే తమిళనాడులో ఈ రాజకీయ అనిశ్చితికి కారణంగా చెబుతున్నారు.

Similar News