ఆప‌రేష‌న్ లోకేష్‌... వైసీపీ వ్యూహం ప్లాప్‌

Update: 2017-11-10 13:30 GMT

శాస‌న‌స‌భ సాక్షిగా లోకేష్‌ని ముప్ప‌తిప్ప‌లు పెట్టాల‌ని వైకాపా వేసిన వ్యూహం బెడిసికొట్టింది. ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేష్ మంత్రి హోదాలో అసెంబ్లీలోకి అడుగుపెడ‌తారు. ఆ స‌మ‌యంలో లోకేష్ ని ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌శ్న‌లు సంధించి ఇరకాటంలో పెట్టాల‌ని వైకాపా ముఖ్య నేత‌లు గ‌తంలోనే ఒక వ్యూహం ప‌న్నారు. లోకేష్‌ని మాన‌సికంగా బ‌ల‌హీన‌ప‌రిచి రాష్ట్ర‌వ్యాప్తంగా బ‌ల‌మైన సంకేతాలు అసెంబ్లీ సాక్షిగా పంపించాల‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. మంత్రిగా అనుభ‌వం లేకపోవ‌డంతో పాటు పంచాయ‌తీరాజ్‌, ఐటీ వంటి కీల‌క శాఖ‌లు చూస్తున్న లోకేష్‌ని అసెంబ్లీలో ఇబ్బంది పెడితే ఎదుర్కొనే శ‌క్తి ఉందా? అనే అంశంపై తెదేపా అగ్ర‌నేత‌ల్లో కూడా ఒక‌ర‌క‌మైన చ‌ర్చ న‌డిచింది.

లోకేష్ కు కలిసొచ్చిందా....

ఎందుకంటే ఐటీ ద్వారా ల‌క్ష‌లాది ఉద్యోగాలు వ‌స్తాయ‌ని, దాదాపు 15 ల‌క్ష‌ల కోట్ల మేరా పెట్టుబ‌డులు పెట్ట‌డానికి పేరొందిన కంపెనీలు రాష్ట్రానికి వ‌స్తున్నాయ‌ని ప్ర‌క‌టించారు. వీటిపై అసెంబ్లీలో వైకాపా నానా ప్ర‌శ్న‌లు వేయాల‌ని ప్లాన్ చేసుకుంది. ముఖ్యంగా నిరుద్యోగ స‌మ‌స్య‌, ఐటీలో పెట్టుబ‌డులు, గ్రామీణాభివృద్ధి అంశాల‌కు సంబంధించి లోకేష్‌ని అసెంబ్లీలో ఇబ్బంది పెట్టాల‌ని భావించారు. వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర సంద‌ర్భంగా అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించాల‌ని వైకాపా తీసుకున్న ఆక‌స్మిక నిర్ణ‌యం కొంత‌మేర లోకేష్‌కి క‌లిసొచ్చింది. వ‌చ్చే బ‌డ్జెట్ స‌మావేశాల‌కు కూడా జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతూనే ఉంటుంది. ఈ లెక్క‌న చూస్తే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల వ‌ర‌కు లోకేష్‌కి ప్ర‌తిప‌క్షం నుంచి అసెంబ్లీ నుంచి ఎదురుదాడి లేక‌పోవ‌చ్చు.

ఇరుకున పెట్టే అవకాశం...?

వైకాపా నుంచి తెదేపాలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకొనేవ‌ర‌కు అసెంబ్లీలో అడుగుపెట్ట‌బోమ‌ని క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ అంశాన్ని దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చలో పెట్టాల‌ని వైకాపా నేత‌లు భావించినా ఆశించిన మేర‌కు ప్ర‌యోజ‌నం చేకూర‌డంలేద‌న్న అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రోవైపు అసెంబ్లీ, మండ‌లిలో కూడా ముఖ్య‌మైన బిల్లులు ప్ర‌వేశ‌పెట్టే స‌మ‌యంలో చ‌ర్చ జ‌ర‌గ‌కుండానే బిల్లులు ఆమోదించుకొనే అవ‌కాశం అధికార‌ప‌క్షానికి అవ‌కాశం కుదిరింది. అసెంబ్లీ సాక్షిగా వైకాపా ఎమ్మెల్యేలు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడి అధికార తెదేపాని ఇరుకున పెట్టే అవ‌కాశాన్ని చేజేతుల పోగొట్టుకున్నామ‌న్న బాధ ఆ పార్టీ నేత‌ల్లో కనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని జ‌గ‌న్‌కు చెప్పి ఒప్పించ‌లేమ‌ని వారికి తెలియ‌డంతో వారు మిన్న‌కుంటున్నారు.

Similar News