ఆడశిశువులకు తెలంగాణ సర్కార్ శ్రీరామరక్ష

Update: 2017-02-26 00:30 GMT

పుట్టబోయే బిడ్డలను కడుపులోనే చంపేస్తున్న కొందరు తల్లిదండ్రుల ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుంబిగించింది. కడుపులో ఉన్నది ఆడా, మగా అని తెలుసుకునేందుకు ఇప్పటికీ కొందరు స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. పుట్టేది ఆడపిల్ల అని తేలితే అబార్షన్ చేయిస్తున్నారు. డబ్బు కోసం కక్కుర్తి పడి కొందరు వైద్యులు, కొందరు స్కానింగ్ సెంటర్ల యాజమాన్యం ఈ దారుణానికి ఒడిగడుతున్నట్లు తెలంగాణ సర్కార్ దృష్టికి వచ్చింది. దీంతో ఈ స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

కక్కుర్తి పడుతున్న స్కానింగ్ సెంటర్లు....

గర్భస్థ శిశువులను చంపేస్తుండటం ఇప్పటి నుంచి వస్తుందే కాదు...ఎన్నాళ్ల నుంచో జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రకటించినా....ఎన్ని ప్రచార కార్యక్రమాలు చేపట్టినా ఆడపిల్లలు పుట్టకముందే చనిపోతున్నారు. అయితే దీనికి అడ్డుకట్ట వేయడానికి సరైన వ్యవస్థ అంటూ ఏదీ లేకపోవడంతో స్కానింగ్ సెంటర్ల యజమానులు, వైద్యులు ఈ దారుణానికి ఒడిగడుతున్నారు. అయితే దీనిపై గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఒక నోడల్ అధికారిని కూడా నియమించాలని భావిస్తోంది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ఏ స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ తీయించుకున్నా వాటి కాపీలను జిల్లా వైద్యాధికారికి విధిగా పంపాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. ఇకపై స్కానింగ్ రిపోర్ట్ ను ఆన్ లైన్ ద్వారా స్కానింగ్ సెంటర్ల యాజమాన్యమే జిల్లా వైద్యాధికారికి పంపాలని త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి.

ప్రత్యేక నిఘా వ్యవస్థ......

ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఏటా 6.30 లక్షల ప్రసవాలు జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో దాదాపు 90 శాతం మంది ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించకుంటుండగా, మిగిలిన వారు ఇళ్ల వద్దనే చేయించుకుంటున్నట్లు తేలింది. అయితే గర్భిణీ తొమ్మిది మాసాల్లో మూడు సార్లు స్కానింగ్ చేయించుకుంటారు. అంటే ఏటా 20 లక్షల స్కానింగ్ లు జరుగుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ఒక అంచనాకు వచ్చింది. వీరిలో పది శాతం మంది ఆడపిల్ల అని తేలితే అబార్షన్ చేయించుకుంటున్నట్లు కూడా పసిగట్టారు. స్కానింగ్ సెంటర్ల యాజమాన్యాలు కూడా డబ్బులు తీసుకుని పుట్టేది ఆడపిల్లో, మగపిల్లవాడో చెప్పేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో మూడు వేల వరకూ అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లున్నాయి. అయితే పుట్టేది ఆడపిల్లో, మగశిశువో తేలాలంటే ఐదోనెలలోనే సాధ్యమవుతుంది. ఐదో నెలలో జరిగిన స్కానింగ్ రిపోర్ట్ లను బట్టి డెలివరీ జరిగిందా? లేదా? అని తేలుతుందంటున్నారు అధికారులు. అప్పుడు స్కానింగ్ సెంటర్ల యాజమాన్యంపై చర్య తీసుకునే వీలుంటుందని చెబుతున్నారు. ఆన్ లైన్ లో వచ్చే నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించి అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ సర్కార్.

Similar News