ఆంధ్రా వర్సిటీలో గంజాయి మత్తు

Update: 2017-02-22 01:30 GMT

ఆంధ్రాయునివర్సీటీ గంజాయి మత్తులో ఊగుతోంది. యూనివర్సిటీలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులు గంజాయి తాగుతూ పట్టుబడిన సంఘటన ఇటీవల కలకలం రేపింది. వర్సిటీలోకి చొరబడ్డ గంజాయి గ్యాంగ్ ను తరిమికొట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. పోలీసులు కూడా దీనిని సీరియస్ గా తీసుకుని అసలు గ్యాంగ్ కోసం వెతుకులాటను ప్రారంభించారు.

విద్యార్థులకు సరఫరా చేస్తున్నదెవరు?

ఆంధ్రాయూనివర్సిటీ అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ. ఈ వర్సిటీ నుంచి ఎందరో మేధావులు బయటకు వచ్చి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అటువంటి వర్సిటీలో గంజాయి అమ్మకాలు జరగడం సంచలనం కల్గించింది. ప్రధానంగా వర్సిటీలో పర్యవేక్షణ కొరవడటం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా హాస్టల్స్ లో వార్డెన్లు కనీసం విద్యార్థుల వ్యవహార శైలిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. విశాఖ ఏజెన్సీ నుంచి ఈ గంజాయి నేరుగా వర్సిటీ చేరుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ లోని ఆరో బ్లాక్ లో గంజాయి తాగుతూ విద్యార్థులు పట్టుబడ్డారు. ఈ ఘటనతో యూనివర్సిటీ అధికారులు కూడా ఉలిక్కిపడ్డారు. బయట వ్యక్తులు కూడా వర్సిటీలోకి ఎక్కువగా వస్తుండటాన్ని కూడా సిబ్బంది అడ్డుకోలేకపోతున్నారన్న ఆరోపణలున్నాయి. గంజాయి తాగుతూ పట్టుబడిన ఆరుగురు విద్యార్థులను యూనివర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు. వారి బ్లడ్ శాంపిల్స్ ను తీసి కేజీహెచ్ కు పంపారు. రక్త పరీక్షల నివేదికల ఆధారంగా విద్యార్థులపై చర్యలుంటాయంటున్నారు వర్సిటీ అధికారులు. వెంటనే సీసీ కెమెరాల వ్యవస్థను పటిష్టపర్చాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. మొత్తం మీద విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను మాత్రం పోలీసులు ఇంతవరకూ పట్టుకోక పోవడం గమనార్హం.

Similar News