ఆ మాట వెంకయ్యతో చెప్పించగలరా కామినేని గారూ!

Update: 2016-11-04 08:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కే విషయంలో జరగవలసిన అన్యాయం జరిగేపోయింది. ఇక దాన్ని ఎవ్వరూ చక్కదిద్దగలిగే పరిస్థితి లేదు. అయితే గుడ్డిలో మెల్లలాగా దక్కిన ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించుకోవడం అనే ప్రక్రియ ఒకటీ మిగిలుంది. ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత ఉంటే ఎవరినీ దేబరించాల్సిన అవసరం లేకుండానే నిధులు రావడమూ, ఖర్చపెట్టుకోవడమూ జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాలు మారినా.. మాట మార్చి ఏమార్చడానికి అవకాశం ఉండదు. అందుకే చట్టబద్ధత గురించి చంద్రబాబునాయుడు పదేపదే పట్టుబడుతున్నారు.

అయితే తాజాగా కాకినాడలో రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రకటించిన ప్యాకేజీకి త్వరలోనే చట్టబద్ధత వచ్చేలా చూస్తామంటూ ఘనంగా హామీ ఇచ్చారు. కాకినాడలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు శుక్రవారం నాడు ఘన సన్మానం జరగబోతోంది. ప్యాకేజీ ప్రకటించిన నాటినుంచి ఊరూరా తిరుగుతూ.. ప్యాకేజీ చాలా గొప్పదని ప్రసంగాలు చేసి టముకు వేస్తూ.. సన్మానాలు చేయించుకోవడంలో వెంకయ్యనాయుడు చాలా బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ఆయన విజయవాడ, తిరుపతి నగరాలను , సన్మానాలను పూర్తి చేశారు. ఇప్పుడు కాకినాడలో సన్మానం జరగబోతోంది. అక్కడ కూడా ఆయన మోదీ చాలా గొప్పవాడని, రాష్ట్రానికి చాలా చేయబోతున్నాడని, ప్యాకేజీ చాలా గొప్పదని, దానిద్వారా రాష్ట్రం రూపురేఖలు మారిపోతున్నాయని స్టీరియో ప్రసంగాన్ని వినిపించబోతున్నారు. అయితే కేంద్రంలో హవా చెలాయిస్తున్న మంత్రిగా వెంకయ్యనాయుడు నోటి ద్వారా ఫలానా తేదీలోగా ప్యాకేజీకి చట్టబద్ధత వస్తుంది అనే మాటలను కామినేని శ్రీనివాస్ చెప్పించగలరా? అనేది పలువురికి కలుగుతున్న సందేహం. వెంకయ్యనాయుడు ఎక్కడికక్కడ జారుకుంటూ.. బాధ్యతాయుతమైన ప్రకటన ఏదీ తాను చేయకుండా తప్పించుకుంటూ ఉంటారు. ఆయన ఎటూ హోదా ఇప్పించలేకపోయారు. కనీసం ప్యాకేజీకి చట్టబద్ధత అయినా ఇప్పించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. రాష్ట్ర భాజపా నాయకులకు అది చేతనవుతుందో లేదో గమనించాలి.

భాజపా నుంచి నేర్చుకున్న పాఠమే

నిజానికి ప్యాకేజీకి చట్టబద్ధత గురించి చంద్ర బాబునాయుడు ఇంత గట్టిగా డిమాండ్ చేయడం అనేది భాజపా నుంచి నేర్చుకున్న పాఠమే అని అందరూ అంటున్నారు. ఈ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు ఉండి ఉంటే ప్రత్యేక హోదా చచ్చినట్లు ఇవ్వాల్సి వచ్చేదని, ప్రభుత్వం మారడం వల్ల భాజపా పట్టించుకోవడం లేదని, ఇదే పరిస్థితి రెండేళ్ల తరవాత వస్తే తమ రాష్ట్రం పుట్టి మునుగుతుందని, అందుకే ప్యాకేజీకి అయినా చట్టబద్ధత ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భాజపా ను చూసి నేర్చుకున్న గుణపాఠం వల్లనే చంద్రబాబుకు ఈ ముందు జాగ్రత్త అలవాటైందని అంటున్నారు. కానీ కేంద్రం మాత్రం చట్టబద్ధత సంగతి ఏమీ తేల్చడం లేదు.

Similar News