ఆ ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు తప్పదా?

Update: 2017-01-28 11:07 GMT

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలంటూ అసెంబ్లీ సమావేశాలను అడ్డుకున్న వైసీపీ ఎమ్మెల్యేలపై వేటుకు అంతాసిద్ధమైంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను అడ్డుకున్నారన్న కారణంగా ప్రివిలేజ్ కమిటీ దీనిపై విచారణ పూర్తిచేసింది. మొత్తం 12 మంది ఎమ్మెల్యేలను విచారించింది. వీరిలో ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు నివేదిక ఇవ్వనుంది. ఫిభ్రవరి మొదటి వారంలో స్పీకర్ కు నివేదిక ఇవ్వనున్నట్లు ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ గొల్లపల్లి సూర్యారావు తెలిపారు. అంటే ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో వీరిపై వేటు పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యేక హోదా కోసం...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సజావుగా జరగలేదు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ సభ్యులు శాసనసభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. మొత్తం 12 మందికి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. వీరు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి యనమల రామకృష్ణుడు ఫిర్యాదు చేయడంతో కమిటీ విచారణ చేపట్టింది. మూడు రోజుల పాటు జరిగిన వర్షాకాల సమావేశాల్లో ఒక్క అంశంపైనా చర్చ జరగలేదు. స్పీకర్ పోడియం ముందుకు వచ్చి వైసీపీ సభ్యులు నిరసన తెలియజేయడంతో సభ ఎప్పటికప్పుడు వాయిదా వేయాల్సి వచ్చింది. స్పీకర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన కమిటీ ఇప్పటికి ఐదుసార్లు సమావేశమై ఆరోపణలు ఎదుర్కొంటున్న సభ్యుల వివరణను అడిగి తెలుసుకుంది. 12 మందిలో ఐదుగురి సభ్యుల వివరణ సంతృప్తికరంగా లేదని కమిటీ అభిప్రాయపడింది.

ఆ అయిదుగురు ఎవరంటే....

అయితే 12 మందిలో ఐదుగురిపైనే చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు కమిటీ నివేదిక ఇవ్వనుంది. అందిన సమాచారం ప్రకారం ఆ అయిదుగురిలో దాడిశెట్టి రాజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముత్యాలనాయుడు, శ్రీనివాసులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం రాష్ట్రానికి మేలు జరిగే అంశం కోసం తాము పట్టుబట్టామని, ఇది కొత్తేమీ కాదంటున్నారు. టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అప్పటి స్పీకర్ కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలకు వ్యతిరేకంగా తాను కమిటీకి డిసెంట్ నోట్ ను ఇచ్చానని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవద్దని కోరుతూ తాము స్పీకర్ ను, శాసనసభ వ్యవహారాల మంత్రిని కోరనున్నట్లు ఆయన చెప్పారు. అయితే ప్రస్తుతం ఏపీలో ప్రత్యేక హోదా అంశం హీట్ ఎక్కిన నేపథ్యంలో వీరిపై చర్యలు తీసుకునే సాహసం ప్రభుత్వం చేస్తుందా? లేదా? అన్నది వేచి చూడాల్సి ఉంది.

Similar News