అన్నాడీఎంకేకి ఇది శాపమా?

Update: 2017-02-06 07:30 GMT

అన్నాడీఎంకే ముఖ్యమంత్రులకు వారసత్వం లేదు. తమిళనాట జరుగుతున్నది యాధృచ్ఛికమో లేదో తెలియదు కాని అన్నాడీఎంకే ఏలికలందరూ సంతానం లేని వారే. ఎంజి రామచంద్రన్ నుంచి నేటి శశికళ వరకూ అదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ముఖ్యమంత్రికి సన్నిహితులు మాత్రమే తమిళనాట అన్నాడీఎంకే పార్టీ సీఎంలుగా అవుతున్నారు. వారసత్వం లేకపోవడం ఆ పార్టీకి శాపంగా మారిందా?

ఎంజీఆర్ నుంచీ అంతే...

ఎంజీ రామచంద్రన్. తమిళనాట వెండి తెరపై ఒక వెలుగు వెలగారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆయనకు సంతానం లేదు. రామచంద్రన్ మరణానంతరం ఆయన భార్య జానకీ రామచంద్రన్ ముఖ్యమంత్రి అయ్యారు. జానకీ రాంచంద్రన్ తన చెల్లెలు పిల్లలను దత్తత తీసుకున్నారు. కాని వాళ్లెవరూ రాజకీయాల జోలికి రాలేదు. జానకీ రామచంద్రన్ కొద్దిరోజులు మాత్రమే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఎంజీఆర్ కు సన్నిహితంగా మెలిగిన జయలలిత పార్టీని చేజిక్కించుకున్నారు. తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. జయలలితకు పెళ్లి కాలేదు. దీంతో ఆమెకు కూడా వారసత్వం లేదు. దీంతో ఆమె శశికళ సమీప బంధువు సుధాకరన్ ను దత్తత తీసుకున్నారు. సుధాకరన్ పెళ్లి అప్పట్లో సంచలనం కల్గించింది. కోట్లాది రూపాయలు వెచ్చించి పెళ్లి చేయడంతో జయ విమర్శలను ఎదుర్కొన్నారు. ఇప్పడు జయ మరణానంతరం శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. రెండు మూడు రోజుల్లో సీఎం కాబోతున్నారు. కాని చిన్నమ్మకు కూడా సంతానం లేదు. ఆమె చెల్లెలు, తమ్ముడి కొడుకులను దత్తత తీసుకోకపోయినా ...వారే ఇప్పడు పోయెస్ గార్డెన్ లో శశికళకు రక్షణ గా ఉంటున్నారు. మొత్తం మీద తమిళనాడులో అన్నాడీఎంకే లో ముఖ్యమంత్రులకు, పార్టీ ప్రధాన కార్యదర్శులకు వారసత్వం లేదని తేలిపోయింది. పార్టీ అధినేత కు సన్నిహితులే ప్రధాన కార్యదర్శి పదవిని చేపడుతున్నారు. ముఖ్యమంత్రులూ అవుతున్నారు.

Similar News