అన్నా...పన్నీర్....డీఎంకే..?

Update: 2017-02-09 17:30 GMT

అన్నాడీఎంకే కు డీఎంకే మద్దతిస్తుందా? అవుననే అనిపిస్తోంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శాసనసభలో బలనిరూపణ చేసుకోవాల్సి వస్తే డీఎంకే మద్దతిచ్చే అవకాశముంది. ఈ విషయాన్ని డీఎంకే పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సుబ్బలక్ష్మి జగదీశన్ వ్యాఖ్యానించారు. దీంతో పన్నీర్ కు అండగా నిలవాలని డీఎంకే భావిస్తున్నట్లు తెలుస్తోంది. డీఎంకే వ్యూహం కూడా అంతే. అన్నాడీఎంకేను పూర్తిగాచీల్చి తాము లాభపడాలని భావిస్తోంది. స్టాలిన్ కూడా పన్నీర్ కు సన్నిహితంగానే ఉంటారని చెబుతున్నారు.

పన్నీర్ ఆ...ధైర్యంతోనే...

ఎమ్మెల్యేలను బలవంతంగా తరలించడాన్ని కూడా స్టాలిన్ తప్పుపట్టారు. తమిళనాడు ప్రజలు, సెలబ్రిటీలు పన్నీర్ సెల్వానికే మద్దతిస్తుండటంతో...ఆయనకు మద్దతిచ్చి జనంలో కొంత పేరును సంపాదించుకోవాలన్నది కూడా డీఎంకే వ్యూహంగా కన్పిస్తోంది. పన్నీర్ ను ఎంత కాలం పదవిలో ఉంచుతారన్నది పక్కన బెడితే సభలో బలనిరూపణ అంటూ జరిగితే పన్నీర్ వైపే డీఎంకే నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తమిళ ప్రజలు కూడా స్వాగతిస్తారని, అందుకోసమే పన్నీర్ కు మద్దతివ్వాలని దాదాపు డీఎంకే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పన్నీర్ కూడా డీఎంకే తనకు అండగా ఉంటుందనే ధైర్యంతోనే దూకుడుగా వెళుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్నాడీఎంకే వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని డీఎంకే నేతలు పైకి చెబుతున్నా....పోయెస్ గార్డెన్ రాజకీయాన్ని సమాధి చేయాలన్నది డీఎంకే లక్ష్యంగా కన్పిస్తోంది.

Similar News