అన్నా డీఎంకే ను భాజపా టేకోవర్ చేస్తుందా?

Update: 2016-12-06 05:22 GMT

ద్రవిడ రాజకీయాల్లో అమ్మ శకం ముగిసిపోయింది. రాజకీయాల్లో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ.. తిరుగులేని ప్రతీకారేచ్ఛతో పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ప్రస్థానం సాగించిన జయలలిత అనంత లోకాలకు వెళ్లిపోయారు. అన్నా డీఎంకే పార్టీ మీద జయలలిత ముద్ర ఎంత ప్రభావపూరితమైనదంటే.. కనీసం ఆమె తర్వాతి స్థానం నాయకుడు ఎవరు... జనాన్ని ఆమె స్థాయిలో సమ్మోహన పరచగల వ్యక్తి ఎవరు? అనేది కూడా ఎవరూ తేల్చుకోలేని పరిస్థితిగా తయారయింది. అలాంటి దీనస్థితిలో పార్టీని విడచి జయలలిత వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తమిళనాట రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారబోతున్నాయా? ఈ రాష్ట్రంలో అస్తిత్వం రూపేణా తమకు సున్నా విలువ కలిగి ఉన్న భారతీయ జనతా పార్టీ కాలు మోపడానికి ఖాళీ దొరకబుచ్చుకుంటున్నదా? ఈ పరిణామాలనుంచి.. అన్నా డీఎంకే ను టేకోవర్ చేయడానికి రంగం సిద్ధం అవుతున్నదా? అనే ఊహాగానాలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చల్లో నడుస్తున్నాయి.

ఒక్కముక్కలో చెప్పాలంటే తమిళనాడులో జాతీయ పార్టీలకు స్థానం లేదు. అక్కడ ద్రవిడ పార్టీలదే రాజ్యం. కాంగ్రెస్ డీఎంకే ప్రాపకంలో ప్రతిసారీ ఏదో కొన్ని సీట్లు వారు విదిలిస్తే అక్కడ పోటీచేసి.. తమ మనుగడను కాపాడుకుంటోంది. భారతీయ జనతా పార్టీకి ఆ మాత్రం కూడా దిక్కులేదు. డీఎంకే కు బద్ధ శత్రువు అయిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలితతో పొత్తు పెట్టుకోవాలని.. ఎన్డీయే వ్యూహకర్తలు చాలా ప్రయత్నాలే చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు- ఆ తరువాత కూడా ఆమెను తమ కోటరీలో కలిపేసుకోవాలని చాలా ప్రయత్నాలే చేశారు. సాధారణంగా.. ఎన్నికల ముందు జయలలిత లొంగకపోయినా, ఎన్నికల తర్వాత ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తరువాత అయినా ఆమె యీల్డ్ అవుతుందని ఆశించారు. అయితే.. రాజకీయాల్లో మొండితనం అని ప్రత్యర్థులు పిలిచే దృఢత్వానికి మారుపేరు అయిన జయలలిత మోదీ దళం విజ్ఞప్తుల్ని ఖాతరు చేయలేదు.

అయితే ఆమె అంత దృఢంగా పార్టీని నడిపే నాయకత్వం ఇప్పుడు లేకుండా పోయింది. పైగా జయలలిత జీవన ప్రస్థానపు చివరి ఘట్టం పరిణామాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కాస్త అత్యుత్సాహం కూడా కనబరచిందనే చెప్పాలి. ప్రస్తుతం కేంద్ర సర్కారుకు చాణక్య మంత్రాంగం నెరపడంలో ఉద్ధండుడు అయిన వెంకయ్యనాయుడు చెన్నయ్ బాద్యతలు భుజాన పెట్టుకుని జయలలిత పార్థివ దేహం వద్ద.. పాత్ర రక్తి కట్టిస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో.. ఒక్కసారిగా బలహీనమైన నాయకత్వంలోకి మారిపోయిన అన్నా డీఎంకేను భాజపా క్రమంగా ‘చేరదీసి’.. తమ ఎన్డీయే లో కలిపేసుకోవడం జరుగుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ద్రవిడ పార్టీల రాజ్యంలో కమల వికాసానికి అనువైన వాతావరణమూ ఏర్పడుతుంది.

Similar News